ఎన్డీఎలో చేరే విషయంపై పరిశీలిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకుని ఎన్డీఎలో చేరుతారని ఆయన ప్రశ్నించారు.
అమరావతి: తాము ఎన్డీఏ లో చేరవచ్చునని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తప్పు పట్టారు. సెక్యులర్ పార్టీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకొని ఎన్డీఎలో చేరుతుందని ఆయన ప్రశ్నించారు.
నరేంద్ర మోడీ రెండోసారి ప్రధాని అయ్యాక గత 8 నెలల కాలంలో కేంద్రం తీసుకువచ్చిన ప్రజా వ్యతరేక బిల్లులకు పార్లమెంట్ లో వైసీపీ మద్దతు ఇచ్చి, ఓటు వేసిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్డీఎలో చేరడానికి ఉబలాట పడుతోందని ఆయన అన్నారు. ఫక్తు ఆర్ఎస్ఎస్ అజెండాను అమలుచేస్తున్న బిజెపి తో జతకట్టడం దళితులు, మైనారిటీ లను మోసం చేయడమేనని ఆయన అన్నారు.
undefined
Also Read: ఎన్డీఎలోకి జగన్, చిరంజీవికి రాజ్యసభ సీటు: బొత్స మాటల ఆంతర్యం ఇదేనా?
రాష్ట్ర మైనారిటీ, దళిత ఉప ముఖ్యమంత్రులు అంజాద్ భాష, నారాయణస్వామిలు బొత్స వ్యాఖ్యలను ఖండించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీఎలో చేరాలనే ప్రతిపాదన వస్తే తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశీలిస్తారని బొత్స సత్యనారాయణ చెప్పిన విషయం తెలిసిందే.
తాము బిజెపికి దగ్గరగానూ లేము, దూరంగానూ లేమని బొత్స చెప్పారు. రాష్ట్రానికి ఏది ఉపయోగపడుతుందంటే ఆ నిర్ణయం తమ అధినేత వైఎస్ జగన్ తీసుకుంటారని ఆయన చెప్పారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్డీఎలో చేరడానికి సిద్ధపడుతోందనే ప్రచారం సాగుతోంది.