నిశ్చితార్ధం వేడుకలో ఆపరేషన్ ఆకర్ష్‌: సీఎం రమేష్‌పై సీపీఐ నారాయణ సంచలనం

By narsimha lodeFirst Published Nov 24, 2019, 4:48 PM IST
Highlights

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థం దుబాయ్‌లో చేస్తూ ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీశారంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.


తిరుపతి: బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థం దుబాయ్‌లో చేస్తూ ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీశారంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరయ్యేందుకు 15 ప్రత్యేక విమానాలను కూడ ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆదివారం  నాడు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ మీడియాతో మాట్లాడారు.  వైసీపీ, టీడీపీ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఆ కార్యక్రమానికి వెళ్తున్నారనే సమాచారం ఉందన్నారు. వీరందరి కోసమే సీఎం రమేష్ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారన్నారు.

నిశ్చితార్థం వేడుకలో బీజేపీలో చేర్చుకొనేందుకు ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టారని  ఆయన  ఆరోపించారు.ఈ వేడుకలో బీజేపీలో చేరాలని చర్చలు జరుపుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. 

భారత రాజ్యాంగ వ్యవస్థను మోదీ, అమిత్ షా కుప్పకూల్చారని నారాయణ విమర్శించారు. ఎన్నికల సంఘం, సీబీఐ వ్యవస్థలను ధ్వంసం చేసి సొంత జాగీరులా మార్చేశారని ఆరోపించారు. 

బీజేపీయేతర రాష్ట్రాలను అణగదొక్కేందుకు ప్లాన్ చేస్తున్నారని.. కేసీఆర్, జగన్ అప్రమత్తంగా లేకపోతే మునిగిపోవడం ఖాయమని నారాయణ హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం మహారాష్ట్రలో ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. 

కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తోందని, అజిత్ పవార్‌ను బెదిరించి బీజేపీ తమ వైపుకు తిప్పుకుందన్నారు. విలువలులేని రాజకీయాలు చేస్తూ మోదీ, అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని నారాయణ విమర్శించారు. 

గాంధీని చంపిన గాడ్సేకు గుడి కట్టినట్లుగా బీజేపీ నేతల వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. బాబ్రీ మసీదును కూల్చినవాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రం కానుందని ఆయన జోస్యం చెప్పారు.

Also read:సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థం: 15 విమానాలు, రాజకీయాలకు వేదిక?

చంద్రబాబుపై ఉన్న కోపాన్ని రాష్ట్ర ప్రజలపై చూపించడాన్ని సీఎం జగన్ మానుకోవాలని నారాయణ సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బూతు రాజకీయాలు మానుకొని హుందాగా వ్యవహరించాలని హితవుపలికారు. రాష్ట్రంలో జగన్ అడుగులు రివర్స్‌లో వెళుతున్నాయన్నారు. 34 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయినా నూతన ఇసుక చట్టం రాదా? అని ప్రశ్నించారు

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు దారుణమని, కేసీఆర్ చెప్పినట్లుగా కోర్టుల్లో తీర్పులు వస్తున్నాయని నారాయణ అన్నారు. కేసీఆర్ మొండి వైఖరిని వీడి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. 
 

click me!