ఆ ఎంపీ, ఆ ఎమ్మెల్సీపై అంత ప్రేమెందుకు : జగన్ సర్కార్‌పై సీపీఐ రామకృష్ణ ఆగ్రహం

By Siva KodatiFirst Published Aug 14, 2022, 7:33 PM IST
Highlights

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో అది నకిలీ వీడియో అని ఎస్పీ ఫకీరప్ప ఎలా తేల్చేశారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైసీపీ (ysrcp) ఎంపీ గోరంట్ల మాధవ్‌ (gorantla madhav) వీడియో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఇంకా చల్లారలేదు. సదరు వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించాలని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ (cpi ramakrishna) మాధవ్ వ్యవహారంపై స్పందించారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీని రక్షించడమే ప్రభుత్వ ధ్యేయమా అని ఆయన ప్రశ్నించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో అది నకిలీ వీడియో అని ఎస్పీ ఫకీరప్ప తేల్చేశారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి విచారణ లేకుండా అది మార్ఫింగ్ వీడియో అని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. తక్షణం ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఇకపోతే... డ్రైవర్‌ను చంపిన ఎమ్మెల్సీ అనంతబాబును కూడా వైసీపీ రక్షిస్తోందని ఆయన ఆరోపించారు. 90 రోజుల్లో చార్జీషీటు వేయకుండా ఎమ్మెల్సీకి సహకరిస్తున్నారని.. అనంతబాబుకు బెయిల్ వచ్చేందుకు కుట్ర జరుగుతోందని రామకృష్ణ ఆరోపించారు. అనంతబాబు కేసులో ప్రభుత్వం తీరుపై ఉద్యమిస్తామని .. డ్రైవర్‌ని చంపి కారులో ఇంటిలో తెచ్చి పడేసిన ఎమ్మెల్సీపై జగన్ ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అని ఆయన నిలదీశారు. 

ALso Read:న్యూడ్ వీడియో కాల్.. దుష్ప్రచారం ఆపకుంటే పాత మాధవ్‌ని చూస్తారు : గోరంట్ల మాధవ్ వార్నింగ్

కాగా.. ఈ నెల 10వ తేదీన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఎంపీ మాధవ్ వీడియో నకిలీదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను పోస్టు చేసిన వారి కోసం దర్యాప్తు చేస్తున్నామని.. దీనిని మార్పింగ్ లేదా ఎడిటింగ్ చేసినట్టుగా ఉందని, ఒరిజినల్ వీడియో దొరికితేనే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపుతామని ఎస్పీ వివరించారు. అనంతపురం ఎస్పీ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకుండా ఈ వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ ఎలా చెబుతారని వారు ప్రశ్నించారు. ఎస్పీ ఫోరెన్సిక్ నిపుణుడా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అలాగే వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయాలని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. మహిళలపై ఇంత అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీపై, ఆయనకు సహకరిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అనిత లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాలనలో మహిళలు అభద్రతా భావంలోకి నెట్టబడ్డారని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. 

click me!