పలాస ఘటనపై జగన్ సీరియస్... మున్సిపల్‌ కమిషనర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

By Arun Kumar PFirst Published Jun 27, 2020, 10:23 AM IST
Highlights

శ్రీకాకుళం జిల్లా పలాసలో కోవిడ్‌ కారణంగా మరణించిన వ్యక్తిని అంత్యక్రియలు విషయంలో అమానవీయంగా వ్యవహరించిన అధికారులపై వేటు పడింది. 

అమరావతి: శ్రీకాకుళం జిల్లా పలాసలో కోవిడ్‌ కారణంగా మరణించిన వ్యక్తిని అంత్యక్రియలు విషయంలో అమానవీయంగా వ్యవహరించిన ఘటన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో సీఎంఓ అధికారులు మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉన్నప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించి పొక్లెయిన్‌ద్వారా మృతదేహాన్ని తరలించడం అమానవీయమని స్పష్టంచేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఈ మేరకు విచారణ జరిపిన జిల్లా కలెక్టర్‌ నివాస్, పలాస మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాజీవ్‌ను సస్పెండ్‌చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌ సోకిన వారి విషయంలో వివక్ష లేకుండా, అమానవీయ చర్యలకు దిగకుండా వైద్యారోగ్యశాఖ ఇదివరకే స్పష్టమైన నిబంధనలను జారీచేసిందని ఈసందర్భంగా ప్రభుత్వం మరోసారి గుర్తుచేసింది.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ కూడా ట్విట్టర్ వేదికన స్పందించారు. ''శ్రీకాకుళం జిల్లా, పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృత్తం కాకూడదు. బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోకతప్పదు'' అంటూ ట్వీట్ చేశారు.

read more    ప్రొక్లెయిన్‌తో వృద్దుడి మృతదేహం తరలింపు: జగన్‌పై లోకేశ్ విమర్శలు (వీడియో) 

పలాసలో శుక్రవారం ఉదయం ఓ 70ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. కాగా.. ఆయన అంత్యక్రియలకు బంధువులంతా వచ్చారు. ఆయన అనారోగ్యంతో చనిపోయాడని వారంతా భావించారు. ఈ ప్రాంతం కంటైన్‌మెంట్‌ జోన్‌ కావడంతో అంత్యక్రియలకు ముందు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ లీల ఆదేశాల మేరకుమృతదేహం నుంచి శాంపిల్స్‌ సేకరించారు. 

అప్పటికప్పుడు ‘వీఎల్‌ఎం’ కిట్‌ల ద్వారా కరోనా పరీక్షలు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించే ప్రక్రియ కొనసాగిస్తుండగా ఫోన్‌ కాల్‌ ద్వారా ట్రూనాట్‌ పాజిటివ్‌ వచ్చినట్టు తెలిసింది. వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, కాలనీవాసులంతా మృతదేహాన్ని వదిలి భయంతో పరుగులు పెట్టారు. 

దీంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు వేయించి మృతదేహాన్ని మున్సిపాలిటీ జేసీబీతో శ్మశానానికి తరలించారు. జేసీబీలో మృతదేహాన్ని తరలిస్తున్న వీడియో విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మృతుడిది 13మంది కుటుంబ సభ్యులు గల ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబసభ్యులే కరోనా అని తేలగానే శవాన్ని అక్కడే వదిలేసి పరుగులు తీయడం గమనార్హం.

 

click me!