పట్టాభిని కస్టడీకి ఇవ్వాలనే పోలీసుల పిటిషన్ కొట్టివేత

By telugu teamFirst Published Oct 28, 2021, 7:25 PM IST
Highlights

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను పోలీసు కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించాలని పోలీసులు దాఖలు చేసిన ఓ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యల్లో కుట్రకోణం దాగి ఉన్నదని, దానికి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆయనను  కస్టడీలోకి తీసుకుంటామని గవర్నర్‌పేట పోలీసులు విజయవాడ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
 

విజయవాడ: జైలు నుంచి Bailపై విడుదలైన TDP అధికార ప్రతినిధి Pattabhiramను గవర్నర్‌పేట పోలీసులు కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, వారి ప్రయత్నం బెడిసికొట్టింది. పట్టాభిని తమ Custodyకి ఇవ్వాలని వీరు కోర్టులో Petition వేశారు. అయితే, ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై ఆయన ఇటీవలే విడుదలయ్యారు. అనంతరం ఆయనపై విజయవాడ న్యాయస్థానంలో గవర్నర్‌పేట పోలీసులు ఓ పిటిషన్ వేశారు. పట్టాభి చేసిన వ్యాఖ్యల్లో కుట్ర కోణం దాగి ఉన్నదని పోలీసులు వాదించారు. ఆ కుట్రకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టడానికి పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై ఇరువైపులా వాదనలు జరిగాయి. పట్టాభి అరెస్టు ప్రక్రియ సరిగా లేదని, ఈ విషయాన్ని ఉన్నత న్యాయస్థానమే పేర్కొన్నదని పట్టాభి తరఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.

Also Read: ఢిల్లీలో ఏపీ పంచాయతీ.. అమిత్ షాకు టీడీపీ, వైసీపీ ఎంపీల పోటాపోటీ ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పట్టాభిరామ్ కేంద్రంగా మారారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆయన బూతు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. పట్టాభిరామ్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశాయి. పట్టాభి నివాసంపైనా దాడులు జరిపాయి. 

ఏపీ పోలీసులు పట్టాభిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నవంబర్ 2న ఆయనను జ్యూడిషియల్ రిమాండ్ తరలించడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని పట్టాభిని కోర్టును ఆశ్రయించారు. ఈ దరఖాస్తుపై వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్‌పై బయటకు వచ్చిన పట్టాభి నేరుగా విజయవాడ రాలేదు. దీనిపై కొంతకాలం అలజడి రేగింది. పట్టాభి అదృశ్యమయ్యారని, పోలీసులే మళ్లీ అరెస్టు చేశారని, లేదు.. లేదు.. మాల్దీవులకు వెళ్లాడని ఇలా ప్రచారం సాగింది. అనంతరం ఆయన ఓ వీడియోను ట్వీట్ చేశారు. తాను బయటకు వచ్చారని, కానీ, త్వరలోనే మళ్లీ వచ్చి క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటారని వివరించారు.

Also Read: టీడీపీ గుర్తింపు రద్దు చేయండి.. ఈసీకి వైసీపీ ఫిర్యాదు, అది తెలుగు దొంగల పార్టీ అన్న విజయసాయి

టీడీపీ కార్యాలయాలపై దాడులపై ఇతర పార్టీల నుంచీ ఖండనలు వచ్చాయి. ఈ దాడులను నిరసిస్తూ చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్షకు దిగాడు. అనంతరం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలిశారు. ఈ దాడులపై, టీడీపీ నేతల నిర్బంధాలపై సీబీఐతో విచారణ జరిపించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అడిగారు.

ప్రపంచంలో ఎక్కడా లేని లిక్కర్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లోనే కనిపిస్తాయని, వాటిని అధికారపార్టీ అనుయాయులే నడుపుతున్నారని చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆరోపణలు చేశారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ కనబడ్డా ఆంధ్రప్రదేశ్ వైపే చూసే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. రాష్ట్రంలో యువత డ్రగ్స్‌కు బానిసయ్యే ముప్పు ఉన్నదని తెలిపారు. వైసీపీ యువతను నిర్వీర్యం చేసే పనిలో ఉన్నదని అన్నారు.

click me!