మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు ఊరట.. ఆ కేసు కొట్టివేసిన కోర్టు..

By Sumanth KanukulaFirst Published Jun 27, 2022, 5:41 PM IST
Highlights

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు ఊరట లభించింది. ఆయనపై ఎన్నికల కమిషన్‌ నమోదు చేసిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. 

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు ఊరట లభించింది. ఆయనపై ఎన్నికల కమిషన్‌ నమోదు చేసిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. వివరాలు.. ఆంధ్రా అక్టోపస్‌గా పేరుగాంచిన మాజీ ఎంపీ లగడపాటి 2014 ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఫ‌లితాల‌పై ముందుగానే అంచనాలను వెల్ల‌డించారంటూ అప్పటి ఎన్నికల కమిషనర్ భ‌న్వ‌ర్‌లాల్ కేసు న‌మోదు చేశారు. ఆ సమయంలో పలు మీడియా సంస్థలకు కూడా నోటీసులు జారీచేశారు. అయితే లగడపాటిపై నమోదైన కేసుకు సంబంధించి ప్రజాప్రతినిధులు కోర్టు విచారణ చేపడుతుంది. 

ఈ కేసుకు సంబంధించి ఆరుగురు సాక్షులను కోర్టు విచారించింది. అలాగే ఆడియో,వీడియో రికార్డింగ్‌లను న్యాయస్థానం పరిశీలించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్ల  ప్రజాప్రతినిధుల కోర్టు నేడు ప్రకటించింది. దీంతో ఆ కేసులో లగడపాటికి ఊరట లభించింది. 

ఇక, 2014లో ఏపీ పునర్విభజన జరిగినప్పటికీ నుంచి లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఏపీని సమైక్యంగా ఉంచాలంటూ జరిగిన ఆందోళనలో రాజగోపాల్ ముందున్నారు. తనదైన దూకుడు ప్రదర్శించారు. పార్లమెంట్‌లో తెలంగాణా అంశంపై చర్చ జరిగిన సమయంలో పెప్పర్  స్ప్రేతో కలకలం సృష్టించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన లగడపాటి.. అదే జరిగితే రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత తన మాటకు కట్టుబడి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

అయితే 2014 ఎన్నికల సమయంలో, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సర్వేలతో లగడపాటి వార్తల్లో నిలిచారు. అయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు,  2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి లగడపాటి సర్వే అంచనాలు పూర్తిగా లెక్కతప్పాయి. ఆయన ఒకటి చెబితే.. ఫలితాలు అందుకు విరుద్దంగా వచ్చాయి. దీంతో లగడపాటి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అయితే లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. ఆయన రాజకీయ నాయకుల కుటుంబాలకు చెందిన ఏదైనా ఫంక్షన్‌లో కనిపించినా, వారిని కలిసినా.. పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. 

click me!