
నంద్యాల పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీలో చేరిన టిడిపి కౌన్సిలర్ ను గుర్తుతెలీని వ్యక్తులు కిడ్నాప్ చేసారన్న ఆరోపణలతో కౌన్సిలర్ కుటుంబసభ్యులు, బంధువులు ధర్నా చేస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే, ఆదివారం మధ్యహ్నం టిడిపికి చెందన 12 వ వార్డు కౌన్సిలర్ హమీద్ భాష వైసీపీలో చేరారు. వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలోనే కౌన్సిలర్ తో పాటు పలువురు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది.
అయితే, రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో మళ్లీ భాషా టిడిపి కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు. తనను బలవంతంగా వైసీపీ వాళ్ళు వాళ్ల కార్యాలయంకు తీసుకెళ్లారంటూ చెప్పటం గమనార్హం. కాగా కౌన్సిలర్ భాషా తనంతట తానుగా వైసీపీ కండువా కప్పుకున్న విషయం ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. చూడబోతే ఎన్నికల తేదీ దగ్గర పడేకొద్దీ ఇటువంటి డ్రామాలు మరెన్ని చూడాల్సి వస్తోందో?