
ఆగస్టు మొదటివారంలో వైసీపీ ఛీఫ్ జగన్ నంద్యాల పర్యటన ఖరారైంది. 3వ తేదీన నంద్యాలలో జరిగే భారీ బహిరంగసభలో పాల్గొంటున్నారు. అదే సమయంలో నంద్యాలలో రోడ్డు షోలో కూడా పాల్గొంటారని సమాచారం. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి ప్రచారంలో కూడా జగన్ పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండ్స్ లో బహిరంగసభ జరుగుతోంది. దాంతో జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. ఇప్పటి వరకూ టిడిపి అభ్యర్ధి జగన్ పర్యటన వివరాలను అభ్యర్ధి శిల్పామోహన్ రెడ్డి వివరించారు.
భూమా బ్రహ్మానందరెడ్డి తరపున రెండుసార్లు చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ప్రచారంలో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. వీరుకాకుడా పలువురు మంత్రులు, ఎంఎల్ఏలు కూడా పాల్గొన్నారు. నంద్యాల గెలుపును చంద్రబాబు ప్రతిష్టగా తీసుకోవటంతో అందుబాటులో ఉన్న సమస్త వనరులను టిడిపి వాడేస్తోంది. అందుకే నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు పలువురు ఎంఎల్సీలను కూడా ఇన్ఛార్జిలను నియమించి ప్రచార బాధ్యతలను అప్పగించారు.
అదే సమయంలో వైసీపీ తరపున అభ్యర్ధి తో పాటు పలువురు ఎంఎల్ఏలు ప్రచారం చేసారు. అయితే, అందరూ జగన్ పర్యటన గురించే ఎదురు చూస్తున్నారు. ఈనెలాఖరుకే ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం కూడా జరిగింది. అయితే, 3వ తేదీన ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు స్వయంగా శిల్పానే ఆదివారం రాత్రి ప్రకటించారు. దాంతో జగన్ పర్యటన ఖరారైనట్లే. షెడ్యూల్ విడుదలతోనే ఊపందుకుంటున్న నంద్యాల ఉపఎన్నిక జగన్ ప్రచారంతో మరింత వేడి పుట్టించటం ఖాయం.