
తమ్ముళ్ళల్లో క్రమశిక్షణ అన్నది పూర్తిగా కట్టుతప్పినట్లే కనబడుతోంది. ఆవు చేలో మేస్తే దూడలు గట్టున మేస్తాయా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు తమ్ముళ్ళు. ఎంఎల్ఏ-ఎంఎల్సీలే రోడ్డున పడి కొట్టుకుంటుంటే తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మద్దతుదారులు. అనంతరపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తమ్ముళ్ళు శుక్రవారం కొట్టుకున్నారు.
అనంతపురంపై పట్టుకోసం ఎంపి జెసి దివాకర్ రెడ్డి, ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరి మద్య ఎప్పటి నుండో పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటోంది. ఆ విషయం చంద్రబాబునాయుతో పాటు అందరికీ తెలుసు. వీరిద్దరి మధ్య సయోధ్య కోసం స్వయంగా చంద్రబాబే ప్రయత్నించినా సాధ్యంకాక వదిలేసారు. దాంతో వారిష్టానుసారం ఇద్దరూ రెచ్చిపోతున్నారు.
నేతలు రెండు వర్గాలుగా విడిపోయి రెచ్చిపోతుంటే మద్దతుదారులు చూస్తూ ఊరుకుంటారా? ఈరోజ అదే జరిగింది. కార్పొరేషన్ కార్యాలయంలో స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశంలో జెసి, ప్రభాకర్ చౌదరి వర్గాలకు చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు.
జెసి వర్గంలోని ఓ కార్పొరేటర్ మాట్లాడుతూ, తన డివిజన్లో జరగాల్సిన అబివృద్ధి కార్యక్రమాలపై ఎంఎల్ఏ వివక్ష చూపుతున్నారని ఆరోపణలు మొదలుపెట్టారు. ఎంఎల్ఏ మద్దతుదారులు ఆరోపణలను అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి చివరకు రెచ్చిపోయారు. ఒకరిపై మరొకరు కలబడి కొట్టేసుకున్నారు. ఈ ఘటన జిల్లా పార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఇపుడే వీరిద్దరి మధ్య పరిస్ధితి ఇలాగుంటే, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఇంకెంత రెచ్చిపోతారో?