రహస్య మంతనాలు: బైరెడ్డికి కాంగ్రెసు బంపర్ ఆఫర్

First Published Jul 13, 2018, 11:54 AM IST
Highlights

బైరెడ్డి రాజశేఖర రెడ్డిని ఊమెన్ చాందీ కాంగ్రెసులోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆయన బైరెడ్డితో రహస్య మంతనాలు జరిపినట్లు సమాచారం. బైరెడ్డికి ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారని, బైరెడ్డి కాంగ్రెసులో చేరేందుకు సిద్ధపడుతున్నారని అంటున్నారు.

కర్నూలు: తటస్థంగా ఉన్న రాజకీయ నేతలను పార్టీలోకి తీసుకునే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా వచ్చిన తర్వాత ఊమెన్ చాందీ ప్రధానంగా ఆ పని మీదనే ఉన్నారు. ఇందులో భాగంగా బైరెడ్డి రాజశేఖర రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. 

రాయలసీమ పోరాట సమితి (ఆర్‌పీఎస్‌) స్థాపించి సీమ హక్కుల కోసం పోరాటం చేసిన బైరెడ్డి ఎన్నికల్లో తగిన ఫలితాలు సాధించలేకపోయారు. దీంతో నంద్యాల ఉప ఎన్నికల తర్వాత ఆర్పీఎస్‌ను రద్దు చేశారు. గతంలో ఆయన అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, ఆయన చేరిక ఆగిపోయింది. ఓ వర్గం వ్యతిరేకించడం వల్లనే బైరెడ్డి టీడీపీలో చేరలేకపోయారని అంటారు.

ఈ నేపథ్యంలో పార్టీలోకి రావాలని బైరెడ్డిని ఊమెన్ చాందీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.  నందికొట్కూరు నియోజకవర్గం నుంచి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి 1994, 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గౌరు చరిత చేతిలో ఓడిపోయారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వు చేశారు. అప్పటి వరకు ఇదే నియోజకవర్గంలో ఉన్న ఓర్వకల్లు మండలాన్ని పాణ్యం నియోజకవర్గంలో విలీనం చేశారు. 

దాంతో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పాణ్యం నియోజకవర్గానికి మారాల్సి వచ్చింది. 2009 ఎన్నికల్లో పాణ్యం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజన ఉద్యమ నేపథ్యంలో ఆయన రాయలసీమ హక్కులను కాపాడాలని మాత్రమే కాకుండా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ సాధన సమితి (ఆర్పీఎస్‌)ను స్థాపించారు. 

ఆ ఎన్నికల్లో బైరెడ్డి పోటీ చేయలేదు. కానీ పాణ్యం నుంచి తన కూతురు బైరెడ్డి శబరిని ఆర్పీఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దింపారు. రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  రాయలసీమ జిల్లాల్లో బస్సు యాత్ర, సభలు, సమావేశాలు నిర్వహించారు. అయితే, చాలా కాలంగా ఆయన మౌనంగా ఉంటూ వచ్చారు.
  
తాజాగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌చాందీ బైరెడ్డితో రహస్య మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ సభ్యత్వాన్ని ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులను బైరెడ్డి కలిశారని అంటున్నారు. ఈ స్థితిలో ఆయన కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.

click me!