raghuveera reddy : రాజకీయాల్లోకి రఘువీరారెడ్డి రీ ఎంట్రీ .. ఆ సీటు కన్ఫర్మ్ అయినట్లేనా..?

By Siva KodatiFirst Published Jan 2, 2024, 4:07 PM IST
Highlights

తెలంగాణలో విజయం సాధించి, దాదాపు పదేళ్ల తర్వాత అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌పైనా ఫోకస్ పెట్టింది. పొత్తుల ద్వారానైనా ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ ఈ దిశగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో రఘువీరారెడ్డి సైతం మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారట. 

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కనుమరుగైన కాంగ్రెస్ నేతల్లో రఘువీరా రెడ్డి ఒకరు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన ఆయన ఒకదశలో సీఎం అవుతారని అంతా భావించారు. అనంతపురం జిల్లాకు చెందిన రఘువీరారెడ్డి కాంగ్రెస్‌లో కీలక నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లలో పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. అనంతరం కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఆదరణ దక్కకపోవడంతో రఘువీరా రాజకీయాలకు దూరమయ్యారు. మీడియాకు దూరంగా సొంత వూరికే పరిమితమైన ఆయన వ్యవసాయం చేస్తూ కాలక్షేపం చేశారు. 

అయితే కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత రఘువీరారెడ్డి తిరిగి రాజకీయాల్లో యాక్టీవ్ య్యారు. అలాగే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. బెంగళూరు నగర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అభ్యర్ధుల విజయానికి పనిచేశారు. ఆ వెంటనే ఏకంగా సీడబ్ల్యూసీ సభ్యుడిగానూ ఛాన్స్ కొట్టేశారు. తెలంగాణలో విజయం సాధించి, దాదాపు పదేళ్ల తర్వాత అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌పైనా ఫోకస్ పెట్టింది. పొత్తుల ద్వారానైనా ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ ఈ దిశగా పావులు కదుపుతున్నారు. 

Latest Videos

ఈ క్రమంలో రఘువీరారెడ్డి సైతం మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారట. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి ఆయన బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ తరపున మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రాతినిథ్యం వహిస్తుండగా ఆమెపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వుంది. దీంతో జగన్ ఆమెను పెనుగొండకు మార్చి.. శంకరనారాయణను సమన్వయకర్తగా నియమించాలని భావిస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే.. హనుమంతరాయ చౌదరి, ఉమా మహేశ్వర నాయుడు మధ్య విభేదాలున్నాయి. ఇద్దరూ టికెట్ సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. వీరిలో ఎవరికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రెండో వ్యక్తి సహకరించే పరిస్ధితి లేదు. 

ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి రఘువీరారెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు వున్నాయని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. మంత్రిగా వున్న సమయంలో రఘువీరా ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి, వివాదరహితుడిగా పేరు వుండటంతో ఆయనకు ఎడ్జ్ వుందని అధిష్టానం అంచనా వేస్తోంది. పైగా బీసీ నేత కావడం అదనపు బలమని భావిస్తోంది. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు వున్నాయని భావిస్తున్న వేళ.. రఘువీరా కోసం కళ్యాణదుర్గాన్ని హస్తం పార్టీ అడిగే అవకాశాలను కొట్టిపారేయలేం. 

click me!