
పవన్ రాజకీయం ఏమిటో అర్ధంకాక జుట్టు పీక్కుంటున్నారు. ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడుతున్న సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంతర్యమేమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.
ఒకసారి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడతారు. మరోసారి రాష్ట్రంలోని టిడిపి ఎంపిలను విమర్శిస్తారు. అంతే కానీ అటు ప్రధానమంత్రి గురించి గానీ ఇటు ముఖ్యమంత్రి గురించి గానీ ఒక్క మాట కూడా అనలేదు. దాంతో పవన్ ఎవరికి మిత్రుడు, ఎవరికి శత్రువో అర్ధం కాక అభిమానులు దిక్కులు చూస్తున్నారు.
జనసేన తరపున అభ్యర్ధులను పోటీలోకి దింపుతారా లేదా అన్న విషయంలో కూడా ఎవరికీ స్పష్టత లేదు. సాధారణ ఎన్నికల సంగతి పక్కన బెడితే త్వరలో వస్తాయనుకుంటున్న మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా పవన్ ఇంత వరకూ ఓ ప్రకటన చేయలేదు. రాబోయే సాధారణ ఎన్నికల్లో తాను అనంతపురం నుండే పోటీ చేయనున్నట్లు మాత్రం ప్రకటించారు.
ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న ఏ పార్టీ అధినేత అయినా ముందుగా అధికారంలో ఉన్న పార్టీనే లక్ష్యంగా చేసుకుంటారు. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలో తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న పార్టీలతో దోస్తానా కుదుర్చుకుంటారు.
అయితే పవన్ ఇంత వరకూ అటువంటి పనులేవీ చేస్తున్నట్లు కనబడలేదు. వామపక్షాలతో కలిసి ఉద్యమాలు చేయాలని పవన్ అనుకుంటున్నట్లు ప్రచారం మాత్రం సాగుతోంది.
గడచిన రెండున్నరేళ్ల పాలనలో టిడిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను బాగానే మూటగట్టుకున్నది. అయితే, ఇంత వరకూ నేరుగా చంద్రబాబునాయడుపైన మాత్రం పవన్ పెదవి విప్పలేదు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వని కేంద్రాన్ని విమర్శిస్తున్నారు గానీ ప్రధానమంత్రిని మాత్రం ఏమీ అనరు.
నిజానికి రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాలేదంటే అందులో చంద్రబాబు చేతగాని తనమే ఎక్కువ. ఆ విషయాన్ని మత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే, పవన్ ఇప్పటి వరకూ నిర్వహించిన బహిరంగ సభలు, మాట్లాడిన మాటలు చూస్తుంటే, భాజపాకు వ్యతిరేకమన్న భావన మాత్రం కలుగుతోంది. మరి, టిడిపి సంగతి ఏమిటి అనేది మాత్రం సస్పెన్సే.
ఇప్పుడు పవన్ ప్రస్తావిస్తున్న అంశాలు కూడా చాలా పాతవే. రోహిత్ వేముల అంశం దాదాపు ఏడాది క్రితంది. ఇక, గోవధ అంశం రాష్టంలో పెద్దగా స్పందన లేనిదే. అలాగే, మోడి, చంద్రబాబులు అధికారంలో ఉన్నంత వరకూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాదన్న విషయం అందరికీ ఎప్పుడో అర్ధమైపోయింది.
ప్రజాసమస్యలపై స్పందించాలంటే రాష్ట్ర పరిధిలోని అంశాలు చాలానే ఉన్నాయి. దేశాన్నంతటిని కుదిపేస్తున్న నోట్ల రద్దు అంశంపై ఇంత వరకూ పెదవి విప్పింది లేదు. రాజధాని నిర్మాణంతో పాటు అభివృద్ధి పేరుతో చంద్రబాబు రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు.
పెరిగిపోతున్న అవినీతి, టిడిపి నేతల దౌర్జన్యాలు, కాల్ మనీ సెక్స్ రాకెట్ బాధితుల వ్యధలు లాంటి ఎన్నో సమస్యలున్నాయి. మరి అవన్నీ పవన్ కు కనబడటం లేదో ఏమో.