Tirupati Rains: చెరువుల ఆక్రమణ వల్లే తిరుపతి మునక...: సీఎం జగన్ తో చిత్తూరు అధికారులు

Arun Kumar P   | Asianet News
Published : Nov 19, 2021, 01:12 PM IST
Tirupati Rains: చెరువుల ఆక్రమణ వల్లే తిరుపతి మునక...: సీఎం జగన్ తో చిత్తూరు అధికారులు

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పరిస్థితి, సహాయక చర్యలపై కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్‌.జగన్‌ సమావేశమయ్యారు.  సచివాలయం నుండి సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల కలెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమై భారీ వర్షాలు జిల్లాలో పరిస్థితి, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై చర్చించారు. ఇవాళ(శుక్రవారం) కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై జగన్ కలెక్టర్లతో సమాలోచనలు జరిపారు.

తమ తమ జిల్లాల్లో వర్షభీభత్సానికి సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అందించారు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యల పర్యవేక్షణకు నెల్లూరులో సీనియర్‌ అధికారి రాజశేఖర్, చిత్తూరుకు సీనియర్‌ అధికారి ప్రద్యుమ్న, కడపకు మరో సీనియర్‌ అధికారి శశిభూషణ్‌ కుమార్‌లను నియమించినట్లు... వారు ఇప్పటికే ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారని సీఎంకు వివరించారు.

గతంలో వాయుగుండం కారణంగా భారీవర్షాలు కురవగా ఇప్పుడు కూడా తీవ్ర వాయుగుండం కారణంగా అత భారీవర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. బంగాళాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం tamilnadu లో తీరందాటిందని... దీని ప్రభావంతో భారీగా వర్షాలు కురిశాయన్నారు. ప్రస్తుతం nellore, chittoor, kadapa జిల్లాల్లో గత రాత్రి నుంచి వర్షం తగ్గుముఖం పట్టిందన్న సమాచారం వస్తోందని అధికారులు సీఎంకు తెలిపారు. 

వర్షాల దాటికి చెరువులకు అక్కడక్కడా గండ్లు పడినట్టు సమాచారం వస్తోందని... ముంపు బాధితులను కూడా వెంటనే సహాయక కేంద్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వరదలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించే చర్యలు కూడా చేపట్టామన్నారు. సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీలేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని... ఆయా జిల్లాలకు అదనంగా నిధులు కూడా ఇచ్చినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

చిత్తూరు జిల్లాలో ప్రస్తుత పరిస్థితులను కలెక్టర్‌ హరినారాయణ్, స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రద్యుమ్న సీఎం జగన్ కు వివరించారు. తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని cm jagan ఆదేశించారు.చెరువుల పూడ్చివేత వల్ల ఇది జరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు. దీనిపై తగిన కార్యాచరణను సిద్ధం చేయాలన్న సీఎం ఆదేశించారు. 

 READ MORE తిరుమల వెంకన్న భక్తులకు శుభవార్త... ఏడుకొండలపైకి రాకపోకల పునరుద్ధరణ

బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందన్నారు. బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని సీఎం సూచించారు. మంచి భోజనం, తాగునీరు అందించాలని... వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

tirumala దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని సీఎం ఆదేశించారు. రైళ్లు, విమానాలు రద్దయిన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో వారిని కిందకు రాకుండా పైనే ఉంచాలని ఆదేశించారు. కనీసం ఒకటి, రెండు రోజులు వారికి తగిన వసతులు సమకూర్చాలని... TTD అధికారులతో సమన్వయం చేసుకుని యాత్రికులకు సహాయంగా నిలవాలి అధికారులకు సీఎం ఆదేశించారు.

తిరుపతి నగరంలో మున్సిపాల్టీ సహా, ఇతర సిబ్బందిని కూడా వినియోగించి పారిశుధ్యం పనులు చేపట్టాలని సీఎం సూచించారు. అవసరమైతే ఇతర మున్సిపాల్టీలనుంచి సిబ్బందిని తీసుకు వచ్చి ఆపరేషన్‌ చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.

kadapa district లో పరిస్థితులను కలెక్టర్‌ విజయరామరాజు సీఎంకు వివరించారు. గండ్లుపడ్డ చెరువుల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని... రోడ్లకు గండ్లు కారణంగా ఎక్కడ రవాణా స్తంభించినా నీరు తగ్గగానే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్‌ పునరుద్ధరణపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వరదనీరు తగ్గగానే పంట నష్టంపై అధికారులు ఎన్యుమరేషన్‌ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. 

READ MORE  చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో వర్షబీభత్సం... సహాయక చర్యలకోసం ప్రత్యేక అధికారుల నియామకం

నెల్లూరు జిల్లాలో పరిస్థితులను కలెక్టర్‌ చక్రధర్‌ సీఎంకు వివరించారు. సోమశిలకు భారీగా వరద నీరు వస్తోందన్న కలెక్టర్‌ తెలిపారు. సమగ్ర వ్యూహంతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారు.somashila project కు పైనుంచి వరదను, డ్యాంలో ప్రస్తుతం ఉన్ననీటిని అంచనా వేసుకుని ఆమేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులను సమన్వయం చేసుకుని వరదనీటి విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడెక్కడ ముంపు ఉండే అవకాశాలు ఉన్నాయో.. ఆయా ప్రాంతాల్లో సహాయక కేంద్రాలను తెరవాలని సీఎం ఆదేశించారు.

 నెల్లూరులో సహాయక చర్యల పర్యవేక్షణకు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ను పంపిస్తున్నట్లు... కడపజిల్లాల్లో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ఇప్పటికే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. 

సచివాలయం నుంచి వీడియో కాన్ఫిరెన్స్ లో హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత, జలవనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్,  డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ కమిషనర్‌ కె కన్నబాబు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్