
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ గెలిచిన తర్వాత.. సీఎంగా మాత్రమే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి (Andhra Pradesh Assembly) వస్తానని చెప్పారు. సభలో వైసీపీ సభ్యులు అసభ్యంగా మాట్లాడరంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను కించపరుస్తూ మాట్లాడరని చెప్పారు. ఈ క్రమంలోనే చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు సభలో నుంచి వెళ్లిపోయారు. సభ్యులందరికీ నమస్కరిస్తూ సభలో నుంచి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం రెండో రోజు కొనసాగుతున్నాయి. సభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగారు.
ఈ క్రమంలో మాట్లాడిన చంద్రబాబు.. ‘సభలో ఎన్నో రకాలు చర్చలు చూశాం.. కానీ ఇంత అవమానం ఎప్పుడూ ఎదుర్కొలేదు. రెండున్నరేళ్లుగా వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కించపరిచారు. చాలా అవమానాలు ఎదుర్కొన్నానని.. కానీ ఇలాంటి పరిస్థితులు చూడలేదని అన్నారు. కుప్పం ఫలితాలు తర్వాత కూడా సీఎం జగన్ నా మొహం చూడాలని అన్నారు. దాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఏ పరువు కోసం నేను ఇన్నేళ్లు తాపత్రయపడ్డానో దాన్ని దెబ్బతీస్తున్నారు. చివరకు నా భార్య ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. నా కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకు లాగారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఉద్వేగానికి లోనయ్యారు.