భారీ వర్షాలతో కలియుగదైవం వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమల కొండపైకి నిలిచిపోయిన వాహనాల రాకపోకలను పునరుద్దరించినట్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెెలిపారు.
తిరుపతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం తిరుపతిలో ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమల ఏడుకొండలపైనా ఇదే పరిస్థితి. భారీ వర్షాల దాటికి తిరుమల కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటం, వరద నీరు ఉదృతంగా ప్రవహించడం రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రమాదాలు జరక్కుండా tirumala tirupati devasthanam అధికారులు ఘాట్ రోడ్డును మూసివేసారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోభక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కొండపైకి రాకపోకలు సాగించే రెండు ఘాట్ రోడ్లను మూసివేస్తూ TTD నిర్ణయం తీసుకుంది. tirumala కొండపైకి కాలినడకన వెళ్లే అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను నవంబరు 17, 18 తేదీల్లో మూసివేయగా నవంబర్ 19వ తేదీన(ఇవాళ) కూడా మూసి ఉంచనున్నట్లు టిటిడి ప్రకటించింది. అయితే వర్షతీవ్రత ప్రస్తుతం తగ్గిన నేపథ్యంలో ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.
అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాక పోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలను టీటీడీ అధికారులు, సిబ్బంది తొలగించారు. భక్తుల సౌకర్యార్థం ఈ మార్గంలో గంట పాటు తిరుమల నుంచి అలిపిరి, గంట పాటు అలిపిరి నుంచి తిరుమలకు చొప్పున వాహనాలను అనుమతించడం జరుగుతోందని తెలిపారు.
read more Tirupati Rains: తిరుపతిలో కుండపోత...చెరువులను తలపిస్తున్న రోడ్లు, జలపాతంలా తిరుమల కొండ (వీడియో)
అయితే heavy rains తో కొండపైనుండి వరదనీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. అలాగే వర్షాలతో బాగా నానడం, వరద నీటి తాకిడికి కొండచరియలు విరిగిపడే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో భక్తులెవరు ఫోటోల కోసం వాహనాలు దిగడం, వాహనాలను ఆపి ఉంచడం లాంటివి చేసి తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
భారీ వర్షాల కారణంగా అలిపిరి నుంచి తిరుమల కు వెళ్ళే ఘాట్ రోడ్ లో అనేక చోట్ల కొండ చరియలు విరిగి పడటంతో వాటి తొలగింపు కార్యక్రమం జరుగుతోందని టిటిడి అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం తరువాత పరిస్థితిని అంచనా వేసి ఈ మార్గంలో వాహనాలను అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితి అద్వాన్నంగా మారింది. కొండపై భారీ వర్షం కురవడంతో వరదనీరు దిగువకు పోటెత్తుతోంది. దీంతో కపిలేశ్వర తీర్థం వద్ద జలపాతం ప్రమాదకరంగా మారింది. ఘాట్ రోడ్డులో వెళుతుండగా ఓ వ్యక్తి అదుపుతప్పి వరదనీటి ప్రవాహంలో కొట్టుకోపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
read more Tirupati Rains: వాయుగుండం ఎఫెక్ట్... భారీ వర్షాలతో తిరుమల దేవాలయం జలదిగ్భందం
ఇక శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్ష ప్రభావిత చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశ నిర్వహించారు. ప్రస్తుతం ఆయా జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిని తెలుసుకున్న సీఎం జాగ్రత్తలు సూచించారు. ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిపరిస్థితులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకునేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.