మన్యంవీరుడు అల్లూరి జయంతి... జగన్, చంద్రబాబు నివాళి

By Arun Kumar PFirst Published Jul 4, 2021, 2:05 PM IST
Highlights

ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం, స్వాతంత్య్ర పోరాటం కోసం బ్రిటీష్ సామ్రాజ్య‌మ‌నే మ‌హాశ‌క్తిని ఢీకొన్న విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ‌రాజు అని సీఎం జగన్ కొనియాడారు. 

అమరావతి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజులు కూడా పాల్గొని సీతారామరాజుకు నివాళి అర్పించారు. 

''ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం,స్వాతంత్ర్య పోరాటం కోసం బ్రిటీష్ సామ్రాజ్య‌మ‌నే మ‌హాశ‌క్తిని ఢీకొన్న విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ‌రాజు. తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకం. అల్లూరి జ‌యంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళుల‌ర్పిస్తున్నా'' అంటూ జగన్ ట్వీట్ చేశారు. 

ఇక టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా అల్లూరికి నివాళి అర్పించారు. ''ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటీషు వారి గుండెల్లో సింహస్వప్నం, మన్యం వీరుడు, స్వతంత్ర భారతావని ముద్దుబిడ్డ శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా మహావీరుడికి తెలుగుదేశం పార్టీ తరపున శ్రద్ధాంజలి. వందేమాతరం అంటూ.. సాయుధ పోరాటంతో బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించి  స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఉరకలెత్తించిన మహనీయుని త్యాగం అనిర్వచనీయం. విశాఖ మన్యం నుండి మహోగ్రరూపంలా గర్జించి.. భారతీయుని సత్తా ఏంటో చూపించిన అల్లూరి సీతారామరాజుకు పాదాభివందనం చేసుకుంటూ... అంజలి ఘటిస్తున్నాం'' అన్నారు. 

''తెలుగుదేశం హయాంలో అల్లూరి జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించి నివాళులు అర్పించాము. అలాంటి మహానుభావుని సేవలను మనసారా స్మరించుకోవాలి'' అని చంద్రబాబు అన్నారు. 

click me!