
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి ముందుకు సాగాలాని భావిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీని కూడా కలుపుకుని పోవాలనే భావనతో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే విషయంపై ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ సంకేతాలు ఇచ్చారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. అయితే తాజాగా ఏపీలో పర్యటిస్తున్న బీజేపీ అగ్ర నేతలు అధికార వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని విమర్శలు గుప్పిస్తున్నారు. రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బును ఆయనే ఇస్తున్నట్లు జగన్ చెబుతున్నారని అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఇందుకు వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, వైవీ సుబ్బారెడ్డి వంటి నేతలు.. బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించినట్టుగా తెలుస్తోంది.
అయితే తాజాగా నేడు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా తొలిసారి బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందించారు. బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయకపోయినప్పటికీ.. పరోక్షంగా టార్గెట్ చేశారు. సీఎం జగన్ సోమవారం పల్నాడు జిల్లా క్రోసూర్‌లో నాలుగో విడత విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. చంద్రబాబు లాగా తనకు ఎల్లో మీడియా, దత్తపుత్రుడు మద్దతు ఉండకపోవచ్చని విమర్శించారు. అదే సమయంలో తనకు బీజేపీ అనే ఒక పార్టీ మద్దతు కూడా ఉండకపోవచ్చని అన్నారు. తాను వీళ్లను నమ్ముకోలేదని, తాను నమ్ముకుంది దేవుడి దయను, ప్రజల ఆశీస్సులను నమ్ముకున్నానని చెప్పారు. దీంతో తనకు బీజేపీ మద్దతు లేదని స్పష్టంగా చెప్పినట్టుగా అయింది. తద్వారా బీజేపీని జగన్ నేరుగా అటాక్ చేసినట్టుగా చెబుతున్నారు.
Also Read: టీడీపీ మూసేయడానికి సిద్దంగా ఉంది.. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు గాడిదలు కాశాడా?: సీఎం జగన్
దీంతో ఏపీలో రాజకీయాల్లో ఏం జరగబోతుందనే చర్చ సాగుతుంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి కేంద్రంలోని అధికార బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కూడా మద్దతుగా నిలిచింది. ప్రధాని మోదీపై కూడా జగన్ పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి కూడా మోదీ ప్రభుత్వ నిర్ణయాలను పలు సందర్భాల్లో సమర్ధిస్తూ వచ్చారు. మరోవైపు కొందరు కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ నేతలు కూడా జగన్ ప్రభుత్వంపై సాఫ్ట్ కార్నర్‌తోనే వ్యవహరిస్తూ వచ్చారు.
Also read: ఏపీకి రూ.5 లక్షల కోట్లు ఇచ్చాం .. మరి ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి : జగన్ పాలనపై అమిత్ షా విమర్శలు
దీంతో ఇరు పార్టీల మధ్య మంచి అవగాహనే ఉందనే రాజకీయ విశ్లేషణలు వినిపించాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీలు కలిసి ముందుకు వెళ్తున్నాయా?.. చంద్రబాబును తిరిగి దగ్గరకు తీసేందుకు సిద్దమైందా? అనే అంశాలు తెరమీదకు వచ్చాయి. ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది.