
తూర్పుగోదావరి జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఏడుగురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. కారు విజయవాడ నుంచి రాజమండ్రి వెల్తుండగా ప్రమాదం జరిగింది. లారీని ఢీకొట్టడంతో తీవ్రంగా దెబ్బతిని ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. లారీని వెనకనుంచి కారు ఢీ కొట్టింది. లారీకి రిపేర్ రావడంతో రోడ్డు పక్కన ఆపి.. డ్రైవర్ దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం వేకువజామున విజయవాడ నుంచి రాజమండ్రి వెడుతున్న ఓ కారు.. వేగంగా వచ్చి లారీనిఢీ కొట్టింది. దీంతో కారు ముందుభాగం పూర్తిగా లారీలోకి చొచ్చుకుపోయి.. తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమాచారం తెలియడంతో వెంటనే రంగంలోని దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి..మృతులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్రేన్ల సాయంతో లారీకింద ఇరుక్కుపోయిన కారును తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. వీరంతా విజయవాడలో వివాహానికి హాజరై, రాజమండ్రిలో మరో వివాహానికి వెడుతున్నట్లుగా సమాచారం. వివాహ వేడుకలో ఉండడం వల్ల మృతుల బంధువులు దీనిమీద స్పందించడంలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.