గుడ్ న్యూస్ ... ఆ రుణాల వడ్డీ మాఫీ చేసిన సీఎం జగన్

By Arun Kumar PFirst Published Jan 18, 2024, 2:53 PM IST
Highlights

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు దేవుడని ... శ్రీకృష్ణుడు ద్వారకను నిర్మించినట్లే ఈయన కులమతతేేడాలు లేకుండా జీవించేందుకు జగనన్న కాలనీలు నిర్మించాడని ఓ మహిళ పేర్కొంది. 

అమరావతి :  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి  కలను నెరవేర్చేందుకు 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకాన్ని తీసుకువచ్చింది. ఇళ్ళు లేని నిరుపేదలకు సెంటు స్థలం ఇవ్వడమే కాదు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కూడా చేస్తోంది జగన్ సర్కార్. అలాగే లబ్దిదారులు బ్యాంకుల నుండి రుణం పొందితే ఆ వడ్డీని కూడా రియింబర్స్ చేస్తోంది. తాజాగా ఈ తాడేపల్లి సీఎం కార్యాలయం నుండి బటన్ నొక్కి వడ్డీ డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో జమచేసారు సీఎం జగన్. 
 
ఇప్పటికే ఈ ఇళ్ల పథకం కింద 12.77 లక్షల మంది లబ్దిదారులకు రూ.4,500.19 కోట్ల బ్యాంకు రుణం అందించింది ప్రభుత్వం. వీరిలో అర్హులైన 4,07,323 మంది లబ్దిదారులకు ఈ దపా వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.46.90 కోట్లను విడుదల చేసారు సీఎం జగన్. మంత్రి జోగి రమేష్, సీఎస్ జవహర్ రెడ్డితో పాటు గృహనిర్మాణ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ... నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం వైఎస్ జగన్ మహా యజ్ఞం చేపట్టారని అన్నారు. ఓ గ్రామం ఏర్పడాలంటే 50 నుండి 100 ఏళ్లు పడుతుంది... కానీ జగనన్న రెండు రెండున్నరేళ్లలో వేలాది గ్రామాలు, కాలనీలు నిర్మించారని అన్నారు. దాదాపు 17వేల జగనన్న కాలనీలను ఏర్పాటుచేయడం ద్వారా జగన్ దేశ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. 

Also Read  కేశినేని నానిని జగన్ కూడా తన్ని తరిమేయడం ఖాయం..: బుద్దా వెంకన్న

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందని జోగి రమేష్ తెలిపారు. జగనన్న కాలనీల్లో నిర్మించుకున్న ఇళ్లలో లబ్దిదారులు పిల్లాపాపలతో హాయిగా వుంటున్నారని అన్నారు. ఈ ఇళ్ల నిర్మాణం అనే మహాయజ్ఞాన్ని కొందరు మారీచులు అడ్డుకునే ప్రయత్నం చేసారు ... అయినా సీఎం జగన్ సంకల్పం ముందు అవేవీ పనిచేయలేవని అన్నారు. ఈ మంచి కార్యక్రమం అక్కాచెల్లెమ్మల వల్లే కొనసాగుతోందని జోగి రమేష్ అన్నారు. 

అనంతరం లబ్దిదారులు కూడా సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో  సొంతిళ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డామని ... ఇప్పుడు కుటుంబంతో ఆనందంగా జీవిస్తున్నామని అన్నారు. ఒక్క రూపాయి లంచం లేకుండా... తమపై ఆర్థిక భారం పడకుండానే ఇళ్లు కట్టుకుంటున్నామని... ఇదంతా జగనన్న చలవేనని అన్నారు.  

గుంటూరుకు చెందిన పగడాల స్వర్ణ సింధూర అనే లబ్దిదారురాలు అయితే జగనన్న కాలనీలను ద్వారకతో పోల్చారు.  శ్రీకృష్ణుడు ద్వారక నగరాన్ని నిర్మిస్తే అన్ని కులాల ప్రజలు అందులో బ్రతికారంటా... జగనన్న కాలనీలు చూస్తుంటే ఇదే గుర్తుకు వస్తుందని అన్నారు. ఆనాడు ప్రజలకు సేవ చేసిన శ్రీకృష్ణుడి లాగే ఈనాడు సేవ చేస్తున్న జగనన్న తమకు దేవుడని సింధూర పేర్కొన్నారు.  నిజమైన హీరో వైఎస్ జగన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

click me!