‘నేను గవర్నర్ ను అలా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా. మంత్రి మండలి రద్దు చేసుకుంటా’.. సీఎం జగన్..

Published : Mar 08, 2022, 07:17 AM IST
‘నేను గవర్నర్ ను అలా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.  మంత్రి మండలి రద్దు  చేసుకుంటా’.. సీఎం జగన్..

సారాంశం

సోమవారం నాటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ మీద కాగితాలు చించి వేయడం మీద సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఇదెక్కడి పద్ధతి అంటూ టీడీపీ సభ్యుల మీద మండిపడ్డారు. నేను అలా చేశానని నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు.   

అమరావతి :  ‘రాజ్యాంగ హోదాలో ఉన్నGovernorను అవమానిస్తారా? ఇదేం పద్దతి..  కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా కాగితాలు చించేసి ఆయనపై విసరడం ఏంటి?’  అని ముఖ్యమంత్రి YS Jagan టిడిపి సభ్యులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  సోమవారం గవర్నర్ ప్రసంగం అనంతరం జరిగిన శాసన సభ వ్యవహారాల సలహా మండలి (BAC) సమావేశంలో ఇదే అంశాన్ని సీఎం ప్రస్తావిస్తూ సమావేశానికి హాజరైన TDP పక్ష ఉపనేత Kinjarapu Atchannaiduను ప్రశ్నించారు. ‘చరిత్రలో ఎప్పుడూ ఇలాంటివి లేవు.  మీ సభ్యుల తీరు Assembly పవిత్రతను నాశనం చేసేలా ఉంది’ అని సీఎం అన్నారు. 

‘గతంలో మీరూ చేశారు’ కదా అని అచ్చన్నాయుడు వ్యాఖ్యానించగా.. ‘నేను చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.  మంత్రి మండలి రద్దు  చేసుకుంటా’ అని సీఎం తీవ్రంగా ప్రతిస్పందించినట్లు తెలిసింది. ‘గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలపడం అనేది ఇది మొదటి సారి కాదు కదా’ అని అచ్చెన్నాయుడు అనగా… ‘ మేము ఎప్పుడూ ఇలా చేయలేదు. చేశాను అని చూపిస్తే రాజీనామా చేస్తా’  అని సీఎం పునరుద్ఘాటించారు . ‘మీరు చేశారని కాదు..  ఇలా గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలపడం అనేది గతంలోనూ జరిగాయి.. అనేది నా ఉద్దేశ్యం’  అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

అచ్చెన్న కమింగ్ బ్యాక్
సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసన సభ బిఏసీ గదిలో భేటీ నిర్వహించారు. సమావేశ గదిలోకి అచ్చెన్నాయుడు ప్రవేశిస్తుండగా.. ‘అచ్చన్న కమింగ్ బ్యాక్’ అంటూ ముఖ్యమంత్రి సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. ‘అసెంబ్లీ ఉన్నప్పుడు రావాలి కదా? ఇందులో కమింగ్ బ్యాక్ ఏముంటుంది’ అని సమాధానమిచ్చారు.

ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వండి…
సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వండి అని అచ్చెన్నాయుడు కోరగా.. ‘ఇస్తున్నారు కదా?  మైక్ ఇస్తే విషయం మాట్లాడకుండా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు’  అని  మంత్రులు అన్నారు. ‘గత సమావేశంలో మీరు(టీడీపీ) అడిగిన అంశంపైనే సభలో చర్చ పెడితే దానిపైన మాట్లాడకుండా డైవర్ట్ చేశారు’  అని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ‘మీ నాయకుడు(చంద్రబాబు నాయుడు)భార్యను సభలో ఎవరూ ఏమీ అనకపోయినా.. అన్నారు అంటూ హంగామా చేశారు కదా’ అని సీఎం,  ఇతర కమిటీ సభ్యులు (మంత్రులు) వ్యాఖ్యనించగా.. ‘మీ వాళ్ళు మా వద్దకు వచ్చి అన్న మాటలే చెప్పాం’  అని అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు.

‘ఆన్ రికార్డు ఉంటే చూపించండి’ చీఫ్ విప్,  మంత్రులు అనగా.. ‘ఆన్ రికార్డ్ అంటామంటే స్పీకర్ వారిని అనుమతించరు కదా?  రన్నింగ్ కామెంట్రీ చేస్తూ మాట్లాడుతున్నారు. కావాలంటే దానికి సంబంధించిన రికార్డులను మేమే ఇస్తాం’ అని అచ్చెన్నాయుడు అనగా.. ‘మీరు ఏవేవో వీడియోలు పట్టుకు వస్తారు అని మంత్రి బుగ్గన  రాజేంద్రనాథ్ రెడ్డి అచ్చెన్నాయుడుతో అన్నారు. ‘అనని మాటలు పట్టుకొని హంగామా చేసి వెళ్లిపోయారు. బయటకు వెళ్లి సభలో నేనేదో అన్నట్లు చిత్రీకరించారు. అప్పుడు కుప్పం మున్సిపాలిటీలో మీ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఒక ప్రణాళిక ప్రకారమే అది చేశారు’  అని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం.

మూడో గీత దాటితే సస్పెన్షన్..
‘సభలో టీడీపీ సభ్యులు చాలా గందరగోళం చేస్తున్నారు’  సీఎం అన్నట్లు తెలిసింది. ‘అందువల్లే మూడంచెలు పెడదామని అనుకుంటున్నా. మొదటి, రెండు అంచెల్లో సభ్యులను హెచ్చరిస్తాం. మూడో గీత పోడియం మీదకు వస్తే డీమ్డ్ టు బి సస్పెన్షన్ను పెడదామనుకుంటున్నా’ అని సభాపతి తమ్మినేని సీతారాం తెలిపినట్లు సమాచారం. కాగా ‘ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే మూడో లైన్ ను మేం టచ్ చేస్తాం’ అని అచ్చెన్నాయుడు ప్రతిస్పందించారు.  
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu