వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చాం: రైతుల అకౌంట్లలో వడ్డీ రాయితీ, ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేసిన సీఎం జగన్

By Sumanth KanukulaFirst Published Nov 28, 2022, 1:56 PM IST
Highlights

వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. 

వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. వ్యవసాయ రంగంపై 62 శాతం జనాభా ఆధారపడి ఉన్నారని చెప్పారు. రైతులను అన్నిరకాలుగా ఆదుకోగలిగితేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందని అన్నారు. రబీ 2020–21, ఖరీఫ్‌–2021 సీజన్లకు చెందిన వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్‌–2022 సీజన్‌లో వివిధ రకాల వైపరీత్యాలవల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లను సీఎం జగన్ సోమవారం జమ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా రైతులకు పరిహారం చెల్లిస్తున్నామని  చెప్పారు. గడిచిన మూడేళ్లలో 65.65 లక్షల మందికి రూ.1,282.11 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్ము జమ చేసినట్టుగా చెప్పారు. తాజాగా జమచేయనున్న మొత్తంతో కలిపి 73.88 లక్షల మంది రైతన్నలకు రూ.1,834.55 కోట్ల సున్నా వడ్డీ రాయితీ అందినట్లు అవుతుందని తెపారు. గడిచిన మూడేళ్ల ఐదు నెలల్లో వివిధ పథకాల కింద రైతన్నలకు రూ. 1,37,975.48 కోట్ల సాయం అందిందన్నారు.  

గత ప్రభుత్వ హయాంలో అంతా గందరగోళమేనని విమర్శించారు. అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా వేసేవారని, రైతన్నలు మధ్య దళారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి ఉండేదని చెప్పారు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఎగ్గొట్టి, మరికొన్ని సందర్భాల్లో రెండు మూడు సీజన్ల తర్వాతే అరకొరగా సాయం అందించేవారని చెప్పారు.. కానీ, ప్రస్తుతం ఈ–క్రాప్‌ ఆధారంగా నమోదైన వాస్తవ సాగుదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగా పరిహారం అందిస్తున్నామని చెప్పారు. 

click me!