రేపు అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధుల విడుదల..

By Sumanth KanukulaFirst Published Nov 29, 2022, 4:04 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం (నవంబర్ 30) అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. అన్నయమ్య జిల్లా ఏర్పాటు తర్వాత సీఎం జగన్ జిల్లాకు రావడం ఇదే తొలిసారి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం (నవంబర్ 30) అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. అన్నయమ్య జిల్లా ఏర్పాటు తర్వాత సీఎం జగన్ జిల్లాకు రావడం ఇదే తొలిసారి. జిల్లాలోని మదనపల్లికి రానున్న సీఎం జగన్ విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు. టిప్పు సుల్తాన్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక నుంచి ఆయన ప్రసంగించనున్నారు. 

సీఎం జగన్ అన్నమయ్య జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. బీటీ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హెలిప్యాడ్‌కు చేరుకోనున్న సీఎం జగన్.. అనిబిసెంట్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, కదిరి రోడ్డు మీదుగా సభ జరిగే టిప్పు సుల్తాన్ మైదానానికి చేరుకోనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, కలెక్టర్ పి గిరీషా, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎంపీ మిథున్ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

సీఎంఓ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. ముఖ్యమంత్రి జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరి 11 గంటలకు మదనపల్లెలోని బీటీ కళాశాల మైదానానికి చేరుకుంటారు. టిప్పుసుల్తాన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇదే వేదికపై జగనన్న విద్యా దీవెన నాలుగో దశను ప్రారంభించి.. లబ్ధిదారులకు నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12:45 గంటలకు మదనపల్లె నుంచి బయలుదేరి 3.10 గంటలకు తన తాడేపల్లికి చేరుకుంటారు.

click me!