సొంత బాబాయ్ కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ.. తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డి?: చంద్రబాబు

Published : Nov 29, 2022, 02:30 PM ISTUpdated : Nov 29, 2022, 02:32 PM IST
సొంత బాబాయ్ కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ.. తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డి?: చంద్రబాబు

సారాంశం

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణ‌కు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఉత్తర్వులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణ‌కు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కేసు విచారణను ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌ స్పెషల్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్టుగా సుప్రీం కోర్టు మంగళవారం తెలిపింది. అయితే సుప్రీం కోర్టు ఉత్తర్వులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సీఎం ఉండగా.. ఆయన సొంత బాబాయ్ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ అయిందని చంద్రబాబు విమర్శించారు. జగన్ రెడ్డి తలెక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

ఇక, వివేకానందరెడ్డి హత్య కేసులో  దర్యాప్తు జరుగుతున్న తీరుపై  ఆయన కూతురు సునీతా రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు పురోగతిని నేరుగా పర్యవేక్షించాలని ఆమె తన పిటిషన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఏపీలో కేసు విచారణ జరిగితే న్యాయం జరగదని సునీతా రెడ్డి పేర్కొన్నారు. హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన తీర్పును వెలువరించింది. 

కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌ స్పెషల్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్టుగా జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని సంబంధిత పత్రాలు, ఛార్జిషీట్, అనుబంధ ఛార్జిషీట్ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేయబడతాయి. భారీ కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసంపై తదుపరి దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తు స్వతంత్రంగా, నిష్పాక్షికంగా చేయాలని స్పష్టం చేసింది. 

మరణించిన వ్యక్తి కూతురు, భార్యకు విచారణపై  అసంతృప్తి ఉన్నందున బదిలీ చేస్తున్నట్టుగా పేర్కొంది. వారికి బాధితులుగా ప్రాథమిక హక్కు పొందే హక్కు ఉంటుందని తెలిపింది. న్యాయం జరగుతుందని మాత్రమే కాదు.. అది జరిగేలా చూడటం కూడా ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది. కేసు విచారణ సమయంలో పెద్ద సంఖ్యలో సాక్షులను విచారించాల్సి ఉంటుందని.. ఆ సాక్షులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ, విచారణను హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని అభిప్రాయపడినట్టుగా ధర్మాసనం తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Sandhyarani: అంగన్వాడీల 9కోర్కెలు పూర్తి చేశాం.. త్వరలో ఇది కూడా పూర్తి చేస్తాం| Asianet News Telugu
AP Food Commission Chairman Chitha Vijay Prathap Reddy on Anganwadi Centres | Asianet News Telugu