‘కూతురు కోసం లండన్ వెళ్లిన సీఎం జగన్.. సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు రాలేరా ?’

By Asianet News  |  First Published Sep 30, 2023, 8:38 AM IST

కోడికత్తి కేసులో సాక్ష్యం చెప్పడానికి ఏపీ సీఎం జగన్ కోర్టుకు హాజరుకావాల్సిందే అని నిందితుడి తరఫు లాయర్ శ్రీనివాసరావు న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. కూతురు కోసం సీఎం లండన్ కు వెళ్లారని గుర్తు చేశారు. కానీ కోర్టుకు ఎందుకు రాలేరని ప్రశ్నించారు.


కోడికత్తి కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాగ్మూలం ఇవ్వడానికి సీఎం జగన్ కు అనుమతి ఇవ్వాలనే పిటిషన్ పై విశాఖ ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. ఇందులో ఇరువురి తరఫు న్యాయవాదులు తమ వాదనను బలంగా వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయడంలో సీఎం జగన్ బిజీగా ఉన్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వెంకటేశ్వర్లు చెప్పారు. కాబట్టి ఆయన కోర్టుకు రాలేరని తెలిపారు. జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాగ్మూలం ఇస్తారని పేర్కొన్నారు. లేకపోతే అడ్వొకేట్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన కోర్టును కోరారు.

పిడుగుల వాన బీభత్సం.. ఆదిలాబాద్ లో ముగ్గురు, ములుగులో ఒకరు మృతి.. పలు మూగ జీవాల మృత్యువాత

Latest Videos


దీనిపై నిందితుడు జనపల్లి శ్రీను తరఫు లాయర్ పిచ్చుకల శ్రీనివాసరావు వాదన వినిపించారు. ఈ కేసులో బాధిత సాక్షిగా ఉన్న సీఎం జగన్ ను సెషన్ కోర్టు ఈ ఏడాది ఏప్రిల్ లోనే వాగ్మూలం ఇవ్వడానికి రావాలని సూచించిందని తెలిపారు. కానీ ఆయన ఇప్పటి వరకు రాలేదని అన్నారు. విచారణకు సహకరించకుండా ఉండటం అంటే నిందితుడు శ్రీనుకు అన్యాయం చేసినట్టే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూతురు కోసం సీఎం జగన్ లండన్ వెళ్లారని తెలిపారు. కానీ సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు రాలేరా అని లాయర్ శ్రీనివాసరావు ప్రశ్నించారు. 

ఫేక్ మెసేజ్ కు భయపడి స్టూడెంట్ ఆత్మహత్య.. ఇంతకీ దానిని ఎవరు పంపించారు..? అందులో ఏముందంటే ?

కోర్టుకు వచ్చే విషయంలో జాప్యం చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని చెప్పారు. ఒక వేళ సాక్షి కోర్టుకు రాకపోతే.. నిందితుడికి బెయిల్ ఇవ్వవచ్చని ఆయన వాదించారు. సెషన్స్ కేసులో బాధిత సాక్షిగా సీఎం జగన్ ఉన్నారని తెలిపారు. కాబట్టి కోర్టుకు రావాలని అన్నారు. కానీ సాక్షి దగ్గరకే అడ్వొకేట్ కమిషన్ తో పాటు నిందితుడు వెళ్లాలని అనుకోవడం సరైంది కాదని తెలిపారు. ఇలా చేయడం న్యాయ విధానాన్ని పక్కన పెట్టడమే అవుతుందని శ్రీనివాసరావు అన్నారు. కాబట్టి జగన్ తప్పకుండా కోర్టుకు రావాలని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఇరు తరఫు లాయర్ల వాదనలను జడ్జి మురళీకృష్ణ విన్నారు. తదుపరి విచారణను వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేశారు. 
 

click me!