
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడంతో మరింత హీటెక్కాయి. టీడీపీ అధినేతకు సపోర్టుగా ఉంటూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపితో జనసేన కలిసి పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ ఉద్రిక్తత తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. నాలుగో విడత ‘జనసేన వారాహి విజయ యాత్ర’ను అక్టోబర్ 1న ప్రారంభించనున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ప్రారంభం కానున్న జనసేనాని వారాహి విజయ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు మీదుగా కొనసాగనున్నది. ఈ మేరకు ఏపిలో నాలుగో విడత వారాహి విజయయాత్ర అక్టోబర్ మొదటి తారీకు నుండి స్టార్ట్ చేయబోతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. అక్టోబర్ 1 న కృష్ణాజిల్లాలోని అవనిగడ్డలో పార్టీ నాయకులతో సమావేశం అనంతరం బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు పార్టీ పేర్కొంది. నాలుగో విడత విజయ యాత్రకు సమన్వయకర్తల నియామకానికి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు.
ఇప్పటికే మూడు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్రకు విశేష ఆదరణ వచ్చింది. ప్రజా సమస్యలపై గళమెత్తడంతో పాటు పాటు సీఎం జగన్ పాలన పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు జనసేనాని పవన్ కళ్యాణ్. వాస్తవానికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. స్వయంగా పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసి పరామర్శించారు. ఈ తరుణంలో జైలు ముందట ప్రెస్ మీట్ పెట్టి టీపీడీ, జనసేన పొత్తు గురించి ప్రకటన చేశారు. ప్రస్తుతం టీడీపీ అధినేత జైల్లో ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిర్వహించబోయే యాత్రపై ఏపీలో సర్వత్రా ఆసక్తి, మరోవైపు ఉత్కంఠ నెలకొంది.