
పేదల పిల్లలు చదువుల కోసం ఇబ్బంది పడకూడదనే విద్యా దీవెన పథకం తీసుకొచ్చామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. తల్లిదండ్రుల పేదరికం పిల్లల భవిష్యత్‌కు అడ్డురాకూడదని అన్నారు. నగిరిలో విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 8 లక్షల 44 వేల 336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. నాలుగేళ్ల కాలంలోనే ఈ పథకం ద్వారా రూ. 11,300 కోట్లు జమ చేశామని తెలిపారు. ప్రతి పేద కుటుంబం నేటి కంటే రేపు మరింత బాగుండాలని చెప్పారు. విద్యార్థుల చదువుల కోసం వారి తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని అన్నారు.
పేద విద్యార్థుల కోసం జగనన్న వసతి దీవెనను కూడా అమలు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. విద్యా దీవెన కూడా పిల్లల భవిష్యత్‌ను మార్చబోయే కార్యక్రమం అని తెలిపారు. పేద విద్యార్థుల పెద్ద చదువులకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నామని చెప్పారు. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని, బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ తీసుకొచ్చామని చెప్పారు. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు చేస్తున్నట్టుగా తెలిపారు. 8వ తరగతి నుంచే విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నామని చెప్పారు. రోజుకో మెనూలో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నామని తెలిపారు. కాలేజీల్లో అదనపు ఫీజులు అడిగితే సీఎంవోకు కాల్ చేయాలని సూచించారు.
ప్రజలకు ఏ మంచి చేయని చంద్రబాబు దుర్మార్గాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే.. ఏ ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. గతానికి, నాలుగేళ్ల జగన్ పాలనకు తేడా ఉందా? లేదా? అని ఆలోచన చేయాలని కోరారు. చంద్రబాబు ఎలాంటి వ్యక్తో ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. చంద్రబాబు ఏ రోజైనా మాట నిలబెట్టుకున్నాడా? అనేది ఆలోచన చేయాలని కోరారు.
చంద్రబాబు అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా వెనకాడడని.. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేదని.. ప్యాకేజ్ ఇచ్చి దత్తపుత్రుడును తీసుకొచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. వెన్నుపోట్లు, మోసం, అబద్దాలతోనే చంద్రబాబు అడుగులు ముందుకు వేశాడని విమర్శించారు.