కొడాలిని ప్రోత్సహిస్తున్న సీఎం సిగ్గు పడాలి.. నానిని అరెస్టు చేయాలి: మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఫైర్

By Mahesh KFirst Published Jan 21, 2022, 4:40 PM IST
Highlights

రాష్ట్ర మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఫైర్ అయ్యారు. ఎందరో మహనీయులను కన్న గుడివాడను అక్రమ సంపాదన కోసం భ్రష్టుపట్టిస్తున్నారని మంత్రిపై నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారాన్ని ప్రజలకు తెలియజేయడానికి వెళ్లిన టీడీపీ నేతలపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. వైసీపీ నేతలు సంఘ విద్రోహ శక్తుల్లా మారుతున్నారని, కొడాలి నాని వంటి సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తున్న సీఎం జగన్ సిగ్గుపడాలని మండిపడ్డారు. నానిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో క్యాసినో(Casino) వ్యవహారం దుమారం రేపుతున్నది. ఈ వివాదం ఇప్పుడు ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షంగా మారిపోయింది. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. రాష్ట్ర మంత్రి కొడాలి నానికి చెందని కళ్యాణ మండపంలో క్యాసినో, జూదం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా, మంత్రి కొడాలి నాని(Kodali Nani) వాటిని కొట్టిపారేస్తున్నారు. తన కళ్యాణ మండపంలో అవి నిర్వహించి ఉన్నట్టు వారు నిరూపిస్తే.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. నిరూపించకపోతే ఏం చేస్తారని సవాల్ విసిరారు. అయితే, ఈ క్యాసినో వ్యవహారంపై నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ(TDP) నేతలపైనా దాడులు జరగడం ఈ చర్చను ఎగదోసింది. ఈ ఉదంతంపై తాజాగా మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప(Chinarajappa) ఫైర్ అయ్యారు.

మంత్రి కొడాలి నాని కనుసన్నల్లోనే గుడివాడలో జూద క్రీడలు జరిగాయని మాజీ మంత్రి చినరాజప్ప ఆరోపించారు. వాటిని వెలికి తీసి ప్రజలకు తెలియజేయాలని టీడీపీ నేతలు భావించారని, అందుకోసం గుడివాడ వెళ్లిన నేతలపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేశాయని, ఇది దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. గుడివాడలో ఎందరో మహానీయులు పుట్టారని, కానీ, మంత్రి కొడాలి నాని తన అక్రమ సంపాదన కోసం గుడివాడను భ్రష్టు పట్టిస్తున్నాడని ఆరోపణలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఏకంగా క్యాసినోనే పెట్టారని, ఇలా తెలుగువారి పరువు, ప్రతిష్టలను మంటగలుపుతున్నారని ఆవేదన చెందారు.

వైసీపీ నేతల అక్రమాలను, చీకటి వ్యాపారాలను బయట పెడితే భౌతిక దాడులకు దిగుతారా? అంటూ నిలదీశారు. రాష్ట్రంలో రౌడీ మూకలు పేట్రేగిపోతుంటే.. డీజీపీ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. గుడివాడలో జరిగిన క్యాసినో, జూద క్రీడలను పోలీసులు అడ్డుకోలేదని, వాటిని వెలికి తీయడానికి వెళ్లిన టీడీపీ నేతలను అడ్డుకోవడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. వైసీపీ నేతలు సంఘ విద్రోహ శక్తుల్లా తయారవుతున్నారని దుయ్యబట్టారు. మంత్రి కొడాలి నాని వంటి సంఘ విద్రోహ శక్తుల్ని ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యమంత్రికి సిగ్గుపడాలి అని విమర్శించారు. అంతేకాదు, గుడివాడలో క్యాసినో నిర్వహించిన కొడాలి నానిని అరెస్టు చేయాలని ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు.

గుడివాడలో Sankranti పర్వదినం సందర్బంగా  ఈ నెల 14 నుండి క్యాసినో నిర్వహించారు.  ఈ విషయమై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఈ విషయమై టీడీపీ నేతలు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులును విచారణ అధికారిగా నియమిస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకొన్నారు. గుడివాడలోని ఓ ఫంక్షన్ హాల్ లో  కోడి పందెలు, పేకాట శిబిరాలు, గుండాటతో పాటు ప్రత్యేకంగా క్యాసినో నిర్వహించారు. రూ. 10 వేలు చెల్లిస్తేనే క్యాసినోలోకి అనుమతించారు నిర్వాహకులు. ఈ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో ప్రత్యేకంగా బౌన్సర్లను కూడా నియమించారు. ఈ ఫంక్షన్ హాల్లో  విచ్చలవిడిగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తో పాటు చట్ట విరుద్దమైన కార్యక్రమాలు నిర్వహించారని  టీడీపీ నేతలు జిల్లా ఎస్పీకి ఈ నెల 17న ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 500 కోట్లు చేతులు మారాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ విషయమై  పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. Casino నిర్వహించిన ఫంక్షన్ హాల్ రాష్ట్ర మంత్రికి చెందిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

click me!