గుడివాడలో టెన్షన్ టెన్షన్: టీడీపీ నేత ముళ్లపూడి రమేష్ పై వైసీపీ దాడి

By narsimha lode  |  First Published Jan 21, 2022, 4:37 PM IST


గుడివాడలో టీడీపీ నేత ముళ్లపూడి రమేష్ పై వైసీపీ నేత పెద్ది కిషోర్ దాడికి దిగారు. ఈ దాడిలో గాయపడిన రమేష్ ను ఆసుపత్రికి తరలించారు. వైసీపీ నేత కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.


గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలో  టీడీపీ  నేత Mullapudi Ramesh పై వైసీపీ నేత Peddi Kishore దాడికి దిగాడు. కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

గుడివాడలోని కే కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో నిర్వహించారనే విషయమై నిజనిర్ధారణ చేసేందుకు TDP నేతలు శుక్రవారం నాడు గుడివాడకు వచ్చారు. 

Latest Videos

మాజీ మంత్రులు ఆలపాటి రాజా, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, టీడీపీ నేత వర్ల రామయ్య తదితరులు కే కన్వెష్షన్ సెంటర్ వైపునకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకొన్నారు. రోడ్డుపైనే బారికేడ్లు పెట్టారు.  

మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన తర్వాత   YCP శ్రేణులు టీడీపీ  కార్యాలయం వద్దకు వచ్చి కుర్చీలు, రాళ్లతో దాదికి దిగారు.  ఈ దాడిని టీడీపీ శ్రేణులు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు.  దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇదే సమయంలో వైసీపీ శ్రేణులు చేసిన దాడిలో  మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ కారు ధ్వంసమైంది.  

ఇరు వర్గాలను అక్కడి నుండి పంపిన తర్వాత కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. టీడీపీ నేత ముళ్లపూడి రమేష్ పై వైసీపీ నేత పెద్ది కిషోర్ దాడికి దిగారు. ఈ దాడితో రమేష్ కు గాయాలయ్యాయి. రమేష్ ను  ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడిన వైసీపీ నేత  కిషోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.


గుడివాడలో Sankranti పర్వదినం సందర్బంగా  ఈ నెల 14 నుండి క్యాసినో నిర్వహించారు.  ఈ విషయమై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఈ విషయమై టీడీపీ నేతలు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులును విచారణ అధికారిగా నియమిస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకొన్నారు.

గుడివాడలోని ఓ ఫంక్షన్ హాల్ లో  కోడి పందెలు, పేకాట శిబిరాలు, గుండాటతో పాటు ప్రత్యేకంగా క్యాసినో నిర్వహించారు. రూ. 10 వేలు చెల్లిస్తేనే క్యాసినోలోకి అనుమతించారు నిర్వాహకులు. ఈ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో ప్రత్యేకంగా బౌన్సర్లను కూడా నియమించారు. 

ఈ ఫంక్షన్ హాల్లో  విచ్చలవిడిగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తో పాటు చట్ట విరుద్దమైన కార్యక్రమాలు నిర్వహించారని  టీడీపీ నేతలు జిల్లా ఎస్పీకి ఈ నెల 17న ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 500 కోట్లు చేతులు మారాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ విషయమై  పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.

Casino నిర్వహించిన ఫంక్షన్ హాల్ రాష్ట్ర మంత్రికి చెందిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఈ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో అమ్మాయిలతో నృత్యాలు కూడా నిర్వహించారని టీడీపీ నేతలు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గోవా తరహలోనే  ఈ క్యాసినో సెంటర్ ను నిర్వహించారని టీడీపీ ఆ ఫిర్యాదులో పేర్కొంది.ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ ఫంక్షన్ హాల్లో  సాగుతున్న తతంగాన్ని ప్రసారం చేశాయి.

ఈ నెల 14 నుండి మూడు రోజుల పాటు ఈ ఫంక్షన్ హాల్లో క్యాసినో నిర్వహించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ విషయమై కొందరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయమై టీడీపీ నేతలు విజయవాడ ఎంపీ కేశినేని నాని నేతృత్వంలో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.

మరో వైపు ఈ విషయమై ఓ సామాజిక కార్యకర్త  వైవీ మురళీకృష్ణ  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖలు రాశారు.  గోవా తర్వాత గుడివాడ క్యాసినో సెంటర్ గా పేరొందిందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేయని విషయాన్ని కూడా ఆ లేఖలో ఆయన గుర్తు చేశారు. కోట్లాది రూపాయాలను ఈ క్యాసినో సెంటర్ కారణంగా స్థానికులు కోల్పోయారని ఆయన ఆ లేఖలో ఫిర్యాదు చేశారు.

ఈ ఫంక్షన్ లో హల్ లో సాగిన క్యాసినో సెంటర్ విషయమై సోషల్ మీడియాలో వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.  ఈ వీడియోలను కూడా విచారణ అధికారి పరిశీలించనున్నారు.అయితే ఈ క్యాసినో సెంటర్ నిర్వహణ వెనుక రాజకీయ నేతల అండ ఉందనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఈ కారణంగానే కనీసం కేసులు కూడా నమోదు కాలేదని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ విషయమై నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు విచారణ నిర్వహించి సమగ్రంగా నివేదిక  ఇవ్వాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. 

click me!