జాగ్రత్త... ఆ మాట ఎక్కడా వినిపించకూడదు: అధికారులకు సీఎం జగన్ హెచ్చరిక

Arun Kumar P   | Asianet News
Published : Mar 02, 2021, 05:21 PM IST
జాగ్రత్త... ఆ మాట ఎక్కడా వినిపించకూడదు: అధికారులకు సీఎం జగన్ హెచ్చరిక

సారాంశం

ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులు, కొత్తగా నిర్మాణం అవుతున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని... కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, నిర్వహణ, శుభ్రత విషయంలో పాటిస్తున్న ప్రమాణాలన్నీ కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉండాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

అమరావతి: ప్రజారోగ్య రంగంలో నాడు - నేడు కార్యక్రమంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు. వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్కులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో అభివృద్ది కార్యక్రమాలు, కొత్త వాటి నిర్మాణాలపై సీఎం సంబంధిత అదికారులతో చర్చించారు. 

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వుండాలని ఆదేశించారు. నాడు - నేడు పనులకు సంబంధించి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణలో కాని ఇతరత్రా ఏ విషయంలోనైనా సమస్యలు వస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని... అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుందామని అధికారులకు సూచించారు.
 
''ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులు, కొత్తగా నిర్మాణం అవుతున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, నిర్వహణ, శుభ్రత విషయంలో పాటిస్తున్న ప్రమాణాలన్నీ కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉండాలి. ఆ తరహా నాణ్యమైన సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందేలా కచ్చితంగా ప్రమాణాలు పాటించాలి. దీనికోసం ఎస్‌ఓపీలను తయారుచేసి, వాటిని అమలు చేయాలి. ఉత్తమ వైద్యం, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలు పాటించడమే లక్ష్యం కావాలి'' అని అన్నారు.

''మనం ఆస్పత్రులకు వెళ్లేటప్పుడు ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు కోరుకుంటామో అవన్నీకూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదవాడికి లభ్యం కావాలి. బెడ్‌షీట్ల దగ్గరనుంచి, శానిటేషన్‌ సహా అన్ని అంశాల్లోనూ ఉత్తమ ప్రమాణాలు పాటించాలి. పేషెంట్‌కు ఇచ్చిన గది, పడక దీంతోపాటు ఆస్పత్రి వాతావరణం, అలాగే రోగులకు అందిస్తున్న భోజనం ఈ మూడు అంశాల్లో మార్పులు కచ్చితంగా కనిపించాలి. ఎక్కడా కూడా అపరిశుభ్రత అన్నది కనిపించకూడదు. ఈమేరకు తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన విధానాలపై ఎస్‌ఓపీలను తయారుచేయాలి'' అని ఆదేశించారు.

read more    ఏపీలో ఆర్థిక నగరాల నిర్మాణం..: మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌2021లో జగన్ ప్రకటన

''ప్రభుత్వ ఆస్పత్రిలో పరికరాలు పనిచేయట్లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు. కొత్త ఆస్పత్రుల నిర్మాణం ఎంత ముఖ్యమో, నిర్వహణ అన్నది కూడా అంతే ముఖ్యం. ఇన్నివేల కోట్ల ఖర్చుచేసి ఆస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త ఆస్రపత్రుల నిర్మాణాలు చేసిన తర్వాత వైద్యులు లేరు, సిబ్బంది లేరు అన్నమాట రాకూడదు. ఎంతమంది వైద్యులు అవసరమో.. అందర్నీ తీసుకోండి. భవనాలు, వైద్య పరికరాలు, అలాగే పేషెంట్‌ గది, పడక, అందిస్తున్న ఆహారం, ఆస్పత్రిలో వాతావరణం వీటిలో ఉత్తమ యాజమాన్యవిధానాలు తయారుకావాలి. దీనికోసం ఏవి అవసరమో అన్నీ చేయాలి'' అని సూచించారు.

''ప్రతి ఆస్పత్రినీ కూడా నిర్వహించే యంత్రాంగం సమర్థవంతంగా ఉండాలి. ఆస్పత్రుల నిర్వహణలో అనుభవమున్న నిపుణులను ఇందులోకి తీసుకురండి. ఆస్పత్రిలో పరిపాలన, క్లినికల్‌ వ్యవహారాలు రెండింటినీ వేరుగా చూడాలి. విలేజ్‌ క్లినిక్కుల దగ్గరనుంచి బోధనాసుపత్రుల వరకూ ఈ విధానం అమలు కావాలి. దీనికి ఎస్‌ఓపీలను తయారుచేయాలి'' అని ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఆంధ్ర ప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ- ఎంఎస్‌ఐడీసీ) వీసీ అండ్‌ ఎండీ వి విజయరామరాజు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ మల్లిఖార్జున్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu