
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లిన సీఎం జగన్ ఆయనతో సమావేశమయ్యారు. సీఎం జగన్ వెంట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. ఈ సమావేశం సందర్భంగా విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల మేరకు నిధుల విడుదల, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ.. తదితర విషయాలను ఈ సమావేశంలో మోదీతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ప్రధానితో భేటీ కోసం సీఎం జగన్ ఆదివారం సాయంత్రం తాడేపల్లి నుంచి ఢిల్లీకి బయలుదేరారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి ఢిల్లీలోని అధికారిక నివాసంలో సీఎం జగన్ బస చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా సీఎం జగన్.. ఆకస్మిక ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయ అజెండా కూడా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక, సీఎం జగన్ పలువురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చించనున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలను కూడా సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అపాయింట్‌మెంట్‌లను అనుసరించి ఈ భేటీలు జరుగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అవసరమైతే సీఎం జగన్ నేడు కూడా ఢిల్లీలోనే బస చేసే అవకాశం ఉంది.