వాటికి జగన్ రెడ్డే బ్రాండ్ అంబాసిడర్: పంచుమర్తి అనురాధ సెటైర్లు

By Arun Kumar PFirst Published Mar 16, 2021, 5:04 PM IST
Highlights

తాను జైలుకు వెళ్లాడు కాబట్టి అందరినీ జైలు పంపాలని జగన్మోహన్ రెడ్డి భావించడం హేయమన్నారు టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ. 

విజయవాడ: 16 నెలలు జైలు జీవితం, 11 చార్జ్ షీట్లు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పాలన ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు.   అక్రమ కేసులతో చంద్రబాబు నాయుడుపై కక్షసాధింపుకు జగన్మోహన్ రెడ్డి పూనుకోవడం పిరికిపంద చర్యగా ఆమె అభివర్ణించారు. చంద్రబాబుపై కేసు పెట్టడమంటే తెలుగువారిని అవమానించడమేనని అనురాధ పేర్కొన్నారు. 

''తాను జైలుకు వెళ్లాడు కాబట్టి అందరినీ జైలు పంపాలని జగన్మోహన్ రెడ్డి భావించడం హేయం. ఏం తప్పు చేశారని చంద్రబాబుకు సీఐడి నోటీసులు ఇచ్చింది? రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి నిర్మించాలనుకోవడమేనా ఆయన చేసిన నేరమా? అసైన్డ్ రైతులకు సామాన్య రైతులతో సమానంగా ప్యాకేజీ ఇవ్వడమేనా ఆయన చేసిన తప్పు?'' అని నిలదీశారు. 

''తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు ఆర్జించిన మీకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదు. నాడు ఇడుపులపాయలో 1200 ఎకరాల అసైన్డ్ భూమిలో 613 ఎకరాలు తెలియక తీసుకున్నమని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు.  ఈరోజుకీ ఆ భూమిని దళితులకు వైఎస్ కుటుంబం తిరిగి ఇవ్వలేదు. ఏ  ఆధారంతో  చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చారు? అగ్ర కులానికి చెందిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ కేసు పెడతారా? వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి'' అని కోరారు.

read more  ఆ హత్య కేసులో జగన్ కూ సిబిఐ నోటిసులు...: వర్ల రామయ్య సంచలనం

''ఇన్ సైడర్ ట్రేడింగ్, క్విడ్ ప్రోకో గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం. ఆ రెంటికి జగన్ రెడ్డే బ్రాండ్ అంబాసిడర్. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ బినామీ ఆయన చేసే వ్యాపారాలు, రాజకీయాలు బినామీ.  14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు స్వచ్ఛమైన వ్యక్తి. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 26 విచారణ కమిటీలు వేసినా చంద్రబాబు నీతిమంతుడు, నికార్సయిన వ్యక్తి కాబట్టే కడిగిన ఆణిముత్యంలా బయటకు వచ్చారు.  న్యాయస్థానం ఆదేశాలతో చంద్రబాబుపై వేసిన కేసులను వైఎస్ విజయమ్మ వెనక్కు తీసుకున్నారు. చంద్రబాబును ఎదుక్కోవడం వైఎస్ వల్లే కాలేదని జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడం'' అని పేర్కొన్నారు. 

''ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చర్యలతో అమరావతి ప్రశ్నార్థకమైంది. లక్ష కోట్ల సంపద సృష్టించే అమరావతి బ్రాండ్ ఇమేజ్ కు బీటలు వాలేలా చేశారు. పారిశ్రామిక వేత్తలు ఏపీ పేరు చెబితేనే హడలిపోతున్నారు. జగన్ రెడ్డి తన చర్యలతో తాను మాత్రమే కాకుండా రాష్ట్ర పరువును బజారుకీడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ బుద్ధిని ప్రజలు అర్థం చేసుకున్నారు. నియంతలు కాలగర్భంలో కలిసిపోయారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి'' అని అనురాధ హెచ్చరించారు. 


 

click me!