ఆ హత్య కేసులో జగన్ కూ సిబిఐ నోటిసులు...: వర్ల రామయ్య సంచలనం

By Arun Kumar PFirst Published Mar 16, 2021, 4:42 PM IST
Highlights

సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి స్వేఛ్చాజీవులు కారనే విషయం ప్రజలు కూడా గమనించాలని సూచించారు టిడిపి నాయకులు వర్ల రామయ్య. 

విజయవాడ: పలుకేసుల్లో ఏ1 ముద్దాయిగా వున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏ2గా వున్న విజయసాయిరెడ్డి కొద్దిరోజులనుంచీ కంగారు పడుతున్నారని... బెయిల్ రద్దయ్యే కాలం సమీపించినందునే వారు  ఆందోళన చెందుతున్నారని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య పేర్కొన్నారు. 

మంగళవారం వర్ల రామయ్య మంగళగిరి లోని పార్టీ జాతీయ కార్యాలయంలో మాట్లాడుతూ... సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి స్వేఛ్చాజీవులు కారనే విషయం ప్రజలు కూడా గమనించాలన్నారు. కోర్టు పరిధిలో నడవవలసిన వ్యక్తులు వారని... ఎక్కడికైనా వెళ్లాలంటే వారు కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే అన్నారు. ఇదివరకే దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిపై వున్న కేసులు చర్చనీయాంశమయ్యాయన్నారు. ఆయనపై 11 సీబీఐ, 5 ఈడీ కేసులు వున్నాయన్నారు. 

''వేలకోట్లు అన్యాక్రాంతం చేశారనే అభియోగాలు జగన్ ఎదుర్కొంటున్నారు. అన్ని కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తి, వాటన్నింటినీ తన హోదా, పలుకుబడిని అడ్డంపెట్టుకొని దాటవేస్తూ వస్తున్నాడు. 2012లో ఆయనపై కేసులు మోపబడితే ఇంతకాలం నుంచీ విచారణ జరగకుండా, తన శక్తియుక్తులు, తెలివితేటలు, అవీనితిసొమ్ముతో వాటిని అడ్టుకుంటున్నాడు. రాష్ట్ర ప్రజలు అప్పగించిన అధికారం కూడా ఆయనకు కలిసొచ్చింది. తనపై ఉన్నకేసులన్నీ విచారణ జరగకుండా అడ్డుకుంటున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న అవినీతి కేసులన్నింటికీ, జగన్ పై ఉన్న కేసులు మోడల్ గా నిలిచాయి'' అని వర్ల ఎద్దేవా చేశారు. 

''జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులు అలానే ఉంటే తమ కేసులు ఎలా విచారిస్తారని అనేకమంది అవినీతిపరులు అంటున్నారు. అవినీతిపరులపై ఉన్నకేసులవిచారణ ఏడాదిలోనే పూర్తిచేస్తామని ప్రధాని మోదీచెప్పారు. కానీ అది ఎందుకో రాజకీయ కారణాలవల్ల ఆగిపోయింది. సుప్రీంకోర్టు అవినీతిపరులపై ఉన్నకేసుల విచారణను వేగవంతం చేయడంతో తన బెయిల్ రద్దవుతుందనే భయాందోళన ముఖ్యమంత్రికి పట్టుకుంది. సీబీఐ విభాగం ముఖ్యమంత్రి వెన్నులో వణుకుపుట్టించే పనిలో నిమగ్నమైంది. సీబీఐ అధికారులు ఇప్పుడు పులివెందులలో విచారణ జరుపుతున్నారు. అసలు ముద్దాయిలను పట్టుకునే స్థాయికి సదరు అధికారులు చేరారు'' అని పేర్కొన్నారు. 

read more   నీ తండ్రి వైఎస్సార్ వల్లే కాలేదు... నీతో ఏమవుతుంది: చినరాజప్ప సీరియస్

''ఇక వివేకానందరెడ్డి హత్యజరిగి నిన్నటికి రెండేళ్లయింది. ఆహత్య కేసు విచారణలో భాగంగా ఏక్షణమైనా సీబీఐ అధికారులు జగన్ ఇంటి తలుపు తట్టే అవకాశముంది. వీటన్నింటినీ చూశాక జగన్ వెన్నులో వణుకు మొదలైంది. తన వ్యవహారాలు, తనపై ఉన్నకేసుల నుంచి  ప్రజల దృష్టి మళ్లించడానికే చంద్రబాబుకు నోటీసులంటూ చిన్నపాచికవేశాడు. ఆయనకు నోటీసులిస్తే ఏమవుతుంది? దళితుల అసైన్డ్ భూముల్లో ఏంఅవకతవకలు జరిగాయి?'' అని ప్రశ్నించారు. 

''జగన్ సంగతేంటి? ఆయన తండ్రి వైఎస్సార్, తాత రాజారెడ్డి సంగతేంటి? 690ఎకరాల దళితుల అసైన్డ్ భూములను ఇడుపులపాయలో స్వాధీనం చేసుకొని, భుజించింది ఈ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం కాదా? 3దశాబ్దాలుగా వాటిని సాగుపేరుతో భుజిస్తూ బొక్కుతోంది మీరు కాదా?  ఈ విషయం మేము చెప్పడంలేదు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డే స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారు. తనతండ్రికి (రాజారెడ్డికి) ఆట్టే చదువు సంధ్యలు లేక 30ఏళ్లనుంచి దళితుల భూములను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియదా? ఎస్సీ, ఎస్టీ, కేసులు పెట్టాల్సింది జగన్ తాత, తండ్రులపై. 30ఏళ్లనుంచి దళితులనోళ్లు కొట్టి, వారి భూములను అనుభవించినందుకు ఆయన కుటుంబంపై ఎస్సీ ఎస్టీ కేసులుపెట్టాలి. అంతేగానీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించిన చంద్రబాబుపై ఎలా కేసులుపెడతారు?'' అని అడిగారు. 

''ఇప్పటికీ కొన్ని ఎకరాల అసైన్డ్ భూమి జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం అధీనంలోనే ఉన్నాయి. ఉన్నాయో, లేదో తేల్చే ధైర్యం జగన్ కు ఉందా? భూముల విచారణపై కడప జిల్లా కలెక్టర్ తో ఒక బృందాన్ని ఏర్పాటు చేయండి, తాము కూడా ఒక బృందంగా ఇడుపులపాయకు వస్తాము. అక్కడ విచారణ జరిపితే దళితుల భూములుఎవరి స్వాధీనంలో ఉన్నాయో తేలుతుంది.  రాష్ట్రంలోని అసైన్డ్ భూములను తిని దళితులకు తీరని అన్యాయం చేసింది జగన్, ఆయన కుటుంబం. మూడు దశాబ్దాల నుంచి ఇడుపులపాయలో దళితుల భూములు తింటున్నది జగన్, ఆయన కుటుంబమే.  అటువంటి వ్యక్తి నంగనాచిలా, చంద్రబాబునాయుడిని తప్పు పడతారా? చట్టబద్ధంగా, న్యాయంగా దళితులభూములను వారి అంగీకారంతో తీసుకొని, వారికి ఈవిధంగా న్యాయంచేస్తా మని ఒప్పందం చేసుకుంటే ఇన్నేళ్ల తర్వాత అక్కడేదో జరి గిందని నోటీసులిస్తారా?  నోటీసులిస్తే ఏమవుతుంది? జగన్ ఉద్దేశం గురించి ప్రజలు తెలుసుకోలేరా? ఆయన దొంగ, కాబట్టి చంద్రబాబునికూడా దొంగగా నిరూపించాలని చూస్తు న్నాడు. జగన్ జైలుకువెళ్లాడు కాబట్టి, చంద్రబాబుని కూడా జైలుకు పంపాలని చూస్తున్నాడు'' అని ఆరోపించారు. 

''అవినీతి సముద్రంలో పీకల్లోతు కూరుకుపోయిన ఏకైక ముఖ్యమంత్రి దేశ యవనికపై జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. 29రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవినీతిలో జగన్ ను మించిన ఘనాపాఠి మరొకరు లేరు. జగన్ తనకంటిలో ఉన్న దూలాన్ని విస్మరించి, ఎదుటివారి కంట్లోలేని నలుసంత అవినీతిని దుర్భిణీవేసి వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. సొంత బాబాయి హత్యకేసులో జగన్ కు సీబీఐ నోటీసులు రాలేదా? వచ్చాయో లేదో జగన్ తన గుండెలపై చేయివేసుకొని చెప్పాలి. వివేకానందరెడ్డిని చంపిన ముద్దాయిలు ఎవరో జగన్ కు తెలియదా? ఎందుకు జగన్ కుటుంబం రెండుగా చీలిపోయింది. వివేకానందరెడ్డి హత్య కేసు గురించి కాదా? అమ్మా అని తనతల్లిని, చెల్లీ అని తన చెల్లెల్ని పలకరించలేని దుస్థితిలో జగన్ ఉండటానికి కారణం వివేకానందరెడ్డి హత్యకేసు కాదా? హత్యచేసిందెవరో జగన్ కు తెలియదా? వివేకానందరెడ్డి హత్యకేసు బయటకు రాకుండా, సీబీఐ విచారణకు అడుగడుగునా అడ్డుతగులుతోంది జగన్ కాడా? ముద్దాయిలెవరో తెలియకూడదని తాపత్రయపడుతోంది ఈ ముఖ్యమంత్రి కారా?'' అని వర్ల నిలదీశారు. 


 

click me!