
Andhra Bar Policy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీకి రూపకల్పన చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా కొత్త బార్ పాలసీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. మద్యం పాలసీలో ప్రధాన లక్ష్యం ప్రజారోగ్యం కాపాడటమేనని సీఎం వెల్లడించారు. ఆదాయాన్ని పెంపుదల కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని స్పష్టంగా పేర్కొన్నారు.
గీత కార్మికులకు గుడ్ న్యూస్..
నూతన బార్ల కేటాయింపులోనూ గీత వర్గాలకు 10 శాతం షాపులు కేటాయించనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. సామాజిక న్యాయం , ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఆన్‌లైన్ లాటరీ విధానం ద్వారా ఈ షాపుల కేటాయింపు జరుగునున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉండగా, కొత్త పాలసీలో లాటరీ పద్ధతి ద్వారా వీటికి అనుమతులు ఇవ్వనున్నారు. అలాగే.. ఈ సంఖ్యను పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
50 వేల లోపు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే రూ.75 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు పెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. .కొత్త పాలసీలో అప్లికేషన్ ఫీజ్, లైసెన్స్ ఫీజు ద్వారా రూ.700 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి బార్‌కు కనీసం 4 అప్లికేషన్లు రావాలనే నిబంధనను పెట్టనున్నారు. బార్ పాలసీలో గీత కులాలకు 10 శాతం బార్లు దక్కేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. మద్యం విక్రయాల్లో పారదర్శకత, నియంత్రణ, అక్రమాలకు చెక్ పెట్టడం వంటి అంశాలకు కొత్త పాలసీలో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే అవకాశముంది.
గతంలో ఏపీలో 3,736 మద్యం షాపులలో 10 శాతం అంటే 340 షాపులు గీత కార్మిక వర్గాల వారికి కేటాయించారు. గతంలో రాష్ట్రంలో 3,736 షాపులు ఉండగా.. అందులో ఓపెన్ కేటగిరీలో 3,396 , గీత కార్మికులకు340 , ప్రీమియం షాపులు 12 గా వర్గీకరించారు. ఆన్‌లైన్ లాటరీ విధానం ద్వారా ఈ షాపుల కేటాయింపు జరిగింది. పూర్తి మార్గదర్శకాలు, కార్యాచరణ ప్రణాళికలు త్వరలో విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ పాలసీ అమలుతో సామాజిక న్యాయం, ప్రజారోగ్యాన్ని బ్యాలెన్స్ చేయాలని భావిస్తోంది.