‘‘గత ప్రభుత్వంలో 30వేల మంది ఆడపడుచులు అదృశ్యమయ్యారని నేను చెప్పినా అప్పటి ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరానికి చెందిన తల్లిదండ్రులు తమ బిడ్డ మైనర్ అని.. ప్రేమ పేరిట తీసుకువెళ్లిపోయారని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే విజయవాడ కమిషనర్, మాచవరం సీఐతో మాట్లాడితే 72 గంటల్లోపే బాలిక ఎక్కడ ఉందో కనిపెట్టి తీసుకొస్తున్నారు.’’
‘‘గత ప్రభుత్వ పాలనలో పంచాయతీలన్నీ నిధుల లేమితో అల్లాడాయి. పంచాయతీలకు రావాల్సిన నిధులు సక్రమంగా రాకపోవడం ఒక ఎత్తయితే, ధర్మంగా పంచాయతీలకు చెందాల్సిన వాటాలను సైతం ఇవ్వలేదు. గ్రామాల నుంచి నిధులు మళ్లించారే తప్ప.. పైసా ఇచ్చింది లేదు. మరోవైపు పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధుల్ని కూడా దారి మళ్లించారు. ఫలితంగా పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది’’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు వివిధ శాఖల నుంచి రావాల్సిన వాటాలను కూడా గత అయిదేళ్లుగా ఇవ్వలేదని చెప్పారు. ఇసుక సీనరేజీ, గనుల సీనరేజీ, రిజిసస్ట్రేషన్ వాటాలు, లేబర్ పన్నుల వాటా... అలాగే ఇతర శాఖల నుంచి కూడా పంచాయతీలకు చట్టపరంగా రావాల్సిన ఏ నిధులు గత పాలనలో అందలేదన్నారు. పంచాయతీ రాజ్ సమీక్షలు చేస్తున్నప్పుడు అధికారులు చెబుతున్న మాటలు వింటే పాలనపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం చూసి వేదన కలుగుతుందన్నారు. దీనిపై క్యాబినెట్ హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి.. పంచాయతీలకు రావల్సిన నిధులపై దృష్టి పెడతామన్నారు.
కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో వివిధ శాఖలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షలు చేశారు. జిల్లా కలెక్టర్ షన్మోహణ్, కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూ, ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సుమారు నాలుగు గంటలపాటు పవన్ కళ్యాణ్ తన పరిధిలోని శాఖలపై విడివిడిగా సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘పంచాయతీలకు నిధులు అందకపోతే పనులు చేసేందుకు అవకాశం ఉండదు. కొన్ని పంచాయతీలు కార్యాలయ నిర్వహణ కూడా భారంగా మారిన పరిస్థితులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వాలి. అలాగే వివిధ శాఖల వారీగా వాటాలను స్థానిక పంచాయతీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిధులతో పాటు కేంద్రం నిధులు, సాధారణ నిధులు పంచాయతీలను అభివృద్ధి పథంలో నడుపుతాయి. అయితే, వైసీపీ పాలనలో పంచాయతీలకు ఏ వైపు నుంచి నిధులు రాలేదు. ఫలితంగా గ్రామాభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. కనీసం ప్రజల నుంచి ఎన్నికయిన వారికి అధికారాలను దూరం చేశారు’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇసుకపైనే ఏటా రూ.వెయ్యి కోట్లు...
‘‘గోదావరి తీర ప్రాంతం ఎక్కువగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క ఇసుక అమ్మకం ద్వారానే ఏటా రూ.వెయ్యి కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వస్తోంది. ఇందులో పంచాయతీలకు ఇసుక సీనరేజ్ వాటా ఇవ్వాలి. అది ఎక్కడా దక్కలేదు. రాష్ట్రంలో ఏ పంచాయతీకి కూడా రావాల్సిన వాటాలు అందలేదు. దీంతో మొత్తం వ్యవస్థ నాశమయ్యే పరిస్థితి వచ్చింది. అధికారులను దీనిపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయమని ఇప్పటికే ఆదేశించాను. పంచాయతీలకు ఏ శాఖ నుంచి ఏ తరహా వాటాలు అందాల్సి ఉంటుంది. వాటి వసూలు పక్కాగా జరగడానికి ఏం చేయాలన్న విషయాలపై నివేదిక ఇవ్వాలని కోరాను. మొదట పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలి. ఆర్థికంగానూ ముందుకు తీసుకెళ్లాలి. పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి అవసరం. అప్పుడే గ్రామాల్లో అనుకున్న పనులు జరుగుతాయి. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుంది. పంచాయతీలకు న్యాయబద్ధంగా అందాల్సిన నిధులు, వాటాలు తీసుకువచ్చేలా చూస్తాం. వైసీపీ హయాంలో గ్రామాల నుంచి సహజ సంపదలు దోచుకున్నారు తప్పితే పంచాయతీలకు రూపాయి విదల్చలేదు’’ అని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
నీళ్లకూ నిధులివ్వలేదు...
‘‘గత ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చే జల్ జీవన్ మిషన్ నిధులకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు. ఫలితంగా పనులు ఆగిపోయాయి. జల్ జీవన్ మిషన్ నిధులతో ప్రతి గ్రామంలో ఇంటింటికీ సురక్షిత తాగునీరందించేందుకు అవసరమైన నిధులు ఉన్నాయి. నిధుల లభ్యత, మ్యాచింగ్ గ్రాంట్లకు ఎంత ఇవ్వాలనే విషయాలపై చర్చిస్తాం. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. సమీక్షలు చేస్తున్నపుడు జల్ జీవన్ మిషన్‌ను ఉపయోగించుకొని రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచి నీరు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై మరింత దృష్టి పెడతాం’’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
హోప్ ఐల్యాండ్... ఏకో టూరిజం పార్కుగా అభివృద్ధి
‘‘కాకినాడకు తలమానికంగా ఉన్న హోప్ ఐల్యాండ్‌ను ఏకో టూరిజం పార్కుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఇక్కడ అరుదైన జంతుజాలం ఉంది. వాటికి హాని కలగకుండా హోప్ ఐల్యాండ్‌ను అభివృద్ధి చేస్తాం. పర్యాటక శాఖ సహాయంతో హోప్ ఐ ల్యాండ్‌ను అద్భుతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. అలాగే, కోరింగ ఏకో పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తయారుచేస్తాం. కాకినాడ స్మార్ట్ సిటీకి సంబంధించిన నిధులు, అభివృద్ధి పనుల బాధ్యత ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌దే. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో ఆయన మాట్లాడతారు. కాకినాడను అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తాం. స్మార్ట్ సిటీ నిధులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసి పనులు పూర్తయ్యేలా చూస్తాం’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఉప్పాడపై దృష్టి...
ప్రపంచీకరణ కారణంగా వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. వాతావరణంలో వచ్చే విపరీతమైన మార్పుల వల్ల ఏటా సముద్ర తీరం ముందుకు వస్తోంది. ఉప్పాడలో ఏటా 20 అడుగుల మేర సముద్రం ముందుకు రావడం వాతావరణంలో కలుగుతున్న మార్పులకు సంకేతం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల కాలుష్యంపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించాం. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించే విధంగా చూడాలి. పరిశ్రమలు, కాలుష్యాన్ని తగ్గించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి తగు విధమైన సూచనలు చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాలలో కాలుష్యం అధికంగా ఉందని ప్రాథమిక నివేదిక వచ్చింది. పర్యావరణ శాఖపై పూర్తి స్తాయి దృష్టి సారిస్తాం. కాలుష్యం తగ్గించే పరిశ్రమలను ప్రోత్సహిస్తాం’’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
మడ అడవులు నాశనం...
‘‘సముద్ర తీరాన్ని రక్షించే మడ అడవులు రక్షించుకోవడం అందరి బాధ్యత. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మడ అడవుల్ని నరికేసి అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అలాగే హానికారకమైన మలేషియన్ బ్రీడ్ రకం కోనో కార్పస్ రకం మొక్కలను పచ్చదనం కోసం పెంచారు. వాటి తొలగింపుపై దృష్టి పెట్టి విడతల వారీగా తొలగిస్తాం. కాలుష్య నిబంధనలు లోబడి పరిశ్రమలు ఎలా పని చేయాలి..? దానిలో ఎలా భాగస్వాముల్ని చేయాలనే దానిపై దృష్టి పెడతాం.
సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో, అటవీ శాఖలో చాలా ఖాళీలు ఉన్నాయి. దీనిపై దృష్టిపెడతాం. ఎవరికీ అధిక పనిభారం ఉండకూడదన్నది నా అభిమతం. అయితే నిధులు, ఖాళీలను అనుసరించి భర్తీ చేస్తాం. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో పిల్లలకు భవిష్యత్తు ఇన్నోవేషన్స్ గురించి ప్రత్యేకంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని చెప్పాం. భావి శాస్త్రవేత్తలను తయారు చేయాల్సిన అవసరం ఉంది. రాజమండ్రిలో ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే, కోతకు గురయిన ఉప్పాడ తీర ప్రాంతం పరిశీలనకు బుధవారం వెళ్తాను. దీని కోసం ప్రత్యేకంగా నిపుణుల బృందం కూడా రానుంది. చెన్నై నుంచి ప్రత్యేక నిపుణులు రానున్నారు’’ అని తెలిపారు పవన్ కళ్యాణ్.
ఆడపిల్లల అదృశ్యాన్ని అరికట్టవచ్చు...
‘‘గత ప్రభుత్వంలో 30వేల మంది ఆడపడుచులు అదృశ్యమయ్యారని నేను చెప్పినా అప్పటి ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరానికి చెందిన తల్లిదండ్రులు తమ బిడ్డ మైనర్ అని.. ప్రేమ పేరిట తీసుకువెళ్లిపోయారని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే విజయవాడ కమిషనర్, మాచవరం సీఐతో మాట్లాడితే 72 గంటల్లోపే బాలిక ఎక్కడ ఉందో కనిపెట్టి తీసుకొస్తున్నారు. దీనికి పోలీసు శాఖకు అభినందనలు. ఓ తల్లి వేదనను.. గుండెతో వింటే తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. ఇది గత ప్రభుత్వానికి లేదు. కనీసం ఆడబిడ్డలు అదృశ్యమయ్యారని చెబితే ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. రాష్ట్రంలో అదృశ్యం అవుతున్న ఆడబిడ్డల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. దీనిని కేబినెట్‌లో పెడతాం. ఒక ఆడబిడ్డ అదృశ్యమైతే వెంటనే తల్లిదండ్రులు స్పందించాలి. 24గంటలు దాటితే పట్టుకోవడం కష్టం. 48 గంటలు దాటితో ఆశలు వదులుకోవాలని పోలీసులే చెబుతున్నారు. కాబట్టి అదృశ్యమైన వెంటనే స్పందించేలా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా ఆలోచన చేస్తాం.
రాష్ట్రంలో శాంతి భద్రతలు బలంగా ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. కేంద్రం వద్ద పలు శాఖలకు సంబంధించి అద్భుతమైన పథకాలు ఉన్నాయి. ప్రసాద్ స్కీం సహాయంతో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయొచ్చు. రాష్ట్రంలో అగ్రికల్చర్ టూరిజం అభివృద్ధి చేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. దీనిని కూడా మేము పరిశీలిస్తాం’’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.