నిర్మాణాల పూర్తికి సీఎం జగన్ సహకరించారు: విజయవాడలో కోర్టు భవనాలు ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ

By Sumanth KanukulaFirst Published Aug 20, 2022, 11:53 AM IST
Highlights

విజయవాడ కోర్టుల ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన జీ ప్లస్ 7 అంతస్థుల కోర్టు కాంప్లెక్స్ భవనాలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా.. తదితరులు పాల్గొన్నారు.
 

విజయవాడ కోర్టుల ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన జీ ప్లస్ 7 అంతస్థుల కోర్టు కాంప్లెక్స్ భవనాలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ సివిల్ కోర్టు ఆవరణలో సీజేఐ ఎన్వీ రమణ మొక్కలు నాటారు. ఇక, ఈ భవన నిర్మాణాలను రూ. 92.60 కోట్లతో 3.70 ఎకరాల్లో చేపట్టారు. 

కోర్టు భవనాల ప్రారంభించిన అనంతరం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్ తెలుగులో మాట్లాడటం ఆనందంగా ఉంది. నేను కూడా తెలుగులోనే ప్రసంగాన్ని కొనసాగిస్తాను. ఈ భవనాల నిర్మాణానికి పదేళ్లకు ముందు నేనే శంకుస్థాపన చేశాను. దాదాపు పదేళ్ల తర్వాత నేనే ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఆలస్యం జరిగినప్పటికీ.. భవన నిర్మాణాలు పూర్తికావడం చాలా సంతోషించదగ్గ విషయం. ప్రజలందరికీ సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉంది’’ అని అన్నారు. 

న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చామని సీజేఐ తెలిపారు. భవనాల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావాలని కోరానని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. భవనాల నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇస్తే సహకరించినట్లవుతుందని చెప్పారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి  చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. న్యాయవ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం అని అన్నారు. న్యాయవ్యవస్థను పటిష్ట పరిచే కార్యక్రమాల్లో ప్రభుత్వాల భాగస్వామ్యం తప్పనిసరని సీజేఐ అన్నారు. 

తనను చాలా మంది గొప్ప మనసుతో ఆదరించి పైకి తీసుకొచ్చారని సీజేఐ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సమాజంలో మార్పు కోసం న్యాయవాదుల కృషి చేయాలని పిలుపునిచ్చారు. తన ఉన్నతికి, విజయానికి కారమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు.  న్యాయ వ్యవస్థలో నావంతుగా చాలా ఖాళీలు పూర్తి చేశానని తెలిపారు. అన్ని కులాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ప్రాతినిధ్యం కల్పించానని పేర్కొన్నారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థను సహకరిస్తానని సీఎం చెప్పారని తెలిపారు. కోర్టు భవనాల నిర్మాణాల పూర్తికి సీఎం జగన్ సహకరించారని చెప్పారు. విశాఖలో కూడా కొన్ని కోర్టు భవనాల నిర్మాణాలు పూర్తి కావాల్సి  ఉందని.. అందుకు సీఎం జగన్ సహకరిస్తారని ఆశిస్తున్నట్టుగా చెప్పారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదనే ఈ కాంప్లెక్స్ శంకుస్తాపన జరిగిందని.. నేడు ఆయన చేతుల మీదుగానే ప్రారంభం కావడం విశేషం అని అన్నారు. ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం అని పేర్కొన్నారు.  జ్యూడీషియరీకి సంబంధించి ప్రతీ విషయంలో ఏపీ అన్ని విధాల సహకరిస్తుందని చెప్పారు. 

click me!