కర్ణాటకలో బిజెపి తెలుగువాళ్ల దెబ్బ రుచి చూసింది: చంద్రబాబు

First Published May 21, 2018, 5:25 PM IST
Highlights

కర్ణాటక పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పందించారు.

అనంతపురం:  కర్ణాటక పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పందించారు. తెలుగువాళ్లు ఎక్కడున్నా బిజెపిని దెబ్బ తీయాలని తాను చెప్పానని, కర్ణాటకలో బిజెపికి తెలుగువాళ్ల దెబ్బ రుచి తగిలిందని ఆయన అన్నారు. 

బిజెపి ఓటమి తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన సోమవారంనాడు అన్నారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యానికి దారి చూపించిందని ఆయన అన్నారు. కేసులు మాఫీ చేయించుకోవడానికి ఓ పార్టీ కర్ణాటకలో బిజెపితో చేతులు కలిపిందని ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. 

సోమవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు తురకలపట్నం గ్రామ చెరువులో జలహారతి, పూజలు నిర్వహించి కృష్ణ జలాలను విడుదల చేశారు. ఆ తర్వాత రచ్చబండ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.  ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు.

కష్టాల్లో ఉందని బిజెపితో తాను పొత్తు పెట్టుకున్నానని, బిజెపి మోసం చేసిందని, నమ్మకద్రోహానికి పాల్పడిందని ఆయన అన్నారు. టీటీడీపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, టీటీడి ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని, తమ ప్రభుత్వం టీటీడీ ప్రతిష్టను కాపాడడానికి కృషి చేస్తుందని అన్నారు. 

మొన్నటి వరకు తనను పొగడినవాళ్లు ఇప్పుడు తిడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకు నీళ్లు లేవని, కరువు ప్రాంతమని, ఏ విధంగా ఉంటుందోనని రాష్ట్ర విభజన సమయంలో భయపడ్డామని ఆయన అన్నారు. 

అనంతపురం జిల్లా అభివృద్ధిలో భాగంగా నీటి పారుదులకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని,, ఇప్పటికే రూ. 53 వేల కోట్లు తాగునీటి కోసం ఖర్చు చేశామని ఆయన చెప్పారు. తనపై నమ్మకంతో ప్రజలు గెలిపించారని, రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది పడకూడదని ఆలోచించానని, తనకు ప్రాణ సమానమైన డ్వాక్రా సంఘాలకు పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి రూ. 10వేల ఆర్థిక సాయం చేసిశామని ముఖ్యమంత్రి చెప్పారు. 

click me!