
విజయవాడ/గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. జనసేన దయతో టీడీపి ప్రభుత్వం ఏర్పడలేదని తెలుగుదేశం నాయకుడు బుద్ధా వెంకన్న అన్నారు
పవన్ కల్యాణ్ కు అంత బలం ఉంటే సొంత పార్టీని ఎందుకు గెలిపించుకోలేకపోయారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పవన్ వల్లే టీడీపీ గెలిచిందని మాట్లాడడం సరికాదని అన్నారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయలేదా అని ఆయన అడిగారు. పవన్ కల్యాణ్ బీజేపీ చెప్పినట్టు చేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. అందరూ కలిసి సీఎం చంద్రబాబుపై దాడి చేస్తున్నారని అన్నారు.
చంద్రబాబు, లోకేష్‌లపై పవన్ చేసిన ఆరోపణలు నిరాధారమని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్నికలకు భయపడే 2014లో పవన్ పోటీ చేయలేదని ఆయన సోమవారం గుంటూరులో మీడియా సమావేశంలో విమర్శించారు.
కన్నా లక్ష్మినారాయణను అధ్యక్షుడిగా పెట్టుకోవడం బీజేపీ దౌర్భాగ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కన్నాకు అధికార యావ తప్ప ఇంకేమీ లేదని వ్యాఖ్యానించారు. బీజేపీతో చంద్రబాబు మైత్రి వద్దనుకున్న తర్వాత దేశంలో మోడీ గ్రాఫ్ పడిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.