అది ప్రజల హక్కు దాని పై మీ బోడిపెత్తనం ఏంటి: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపాటు

By Nagaraju penumalaFirst Published Oct 31, 2019, 7:39 PM IST
Highlights

జగన్ ప్రకటించిన ఇసుకవారోత్సవాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు చేస్తుందట అంటూ సెటైర్లు వేశారు. 
 

గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రవ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. జగన్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా చెలరేగిపోతోందని ఆరోపించారు. 

ఇసుక లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్మికుల ఆత్మహత్యల్ని ప్రభుత్వం ఎగతాళి చేస్తోందని, కాలంచెల్లి చనిపోయారని మంత్రులు మాట్లాడటం చాలా దురదృష్టకరమన్నారు.
 
కూలీలు పనులు లేక ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం సాయం చేయడానికి కూడా ముందుకు రావడంలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని, అందుకే బాధితులను మంత్రులు హేళన చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇసుక కొరతతో జరిగిన ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ధ్వజ మెత్తారు. ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. జగన్ ప్రకటించిన ఇసుకవారోత్సవాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు చేస్తుందట అంటూ సెటైర్లు వేశారు. 

వర్షాలు కురవడం, నదులు ఉధృతంగా ప్రవహించడంతో ఇసుక తీయలేకపోతున్నామని ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ, తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నా అక్కడ లభిస్తున్న ఇసుక ఏపీలో ఎందుకు లభించడం లేదని నిలదీశారు. 

పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోతున్నా కావాలనే వైసీపీ ప్రభుత్వం కృత్రిమ ఇసుక కొరత సృష్టిస్తోందని మండిపడ్డారు. పాత ఇసుక విధానాన్నే ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉచితంగా ఇసుకను తరలించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఆయా ప్రాంతాల్లో లభించే ఇసుకను ప్రజలు తరలించుకునేందుకు ప్రభుత్వం బోడిపెత్తనం ఏంటని నిలదీశారు. అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎవరని నిలదీశారు చంద్రబాబు నాయుడు.
రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు బాధల్లో ఉన్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలని డిమాండ్ చేశారు.  

ఈ సందర్భంగా ఇసుకదొరక్క ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కుటుంబాలకు రూ.25 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ తరపున రూ. లక్ష ఆర్థిక సహాయం చేశారు. చెక్కులను బాధిత కుటుంబాలకు చంద్రబాబు అందజేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కు చంద్రబాబు గుడ్ న్యూస్: నీతోనే ఉంటామన్న మాజీ సీఎం

click me!