సీఎం జగన్, సజ్జల కేసులు పెట్టించి వేధిస్తున్నారు..: కోర్టును ఆశ్రయించిన చింతమనేని ప్రభాకర్

By Arun Kumar P  |  First Published May 26, 2022, 2:38 PM IST

 వైసిపి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పోలీస్ అధికారులు కొందరు తనపై అక్రమకేసులు బనాయించి వేధిస్తున్నారంటూ టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోర్టును ఆశ్రయించారు. 


ఏలూరు: తనపై కావాలనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ టిడిపి మాజీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ (chintamaneni prabhakar) కోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jaganmohan reddy), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy), మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ (goutham sawang) లపై ఏలూరు జిల్లాలో చింతమనేని ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసారు. అంతేకాదు పోలీస్ ఉన్నతాధికారులు రాహుల్ దేవ్ శర్మ, నవజ్యోత్ సింగ్ గ్రేవాల్ తో పాటు నలుగురు సిఐలు, ముగ్గురు ఎస్ఐల పేర్లను కూడా చింతమనేని ప్రైవేట్ పిటిషన్ లో పేర్కొన్నారు.  

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెండు సంవత్సరాల్లోనే  తనపై అక్రమంగా 25 కు పైగా కేసులు నమోదు చేశారని చింతమనేని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ తప్పిదాలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకే ఇలా కేసులు పెట్టి వేధిస్తున్నారని చింతమనేని తన పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

Latest Videos

ఇటీవల ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పై అట్రాసిటీ కేసు న‌మోదైంది. ఏపీలో పెరిగిన క‌రెంట్ ఛార్జీల‌ను నిర‌సిస్తూ ఇటీవల టీడీపీ నాయ‌కులు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అందులో భాగంగానే ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం ప‌రిధిలోని వెంకంపాలెంలో జరిగిన నిరసనలో  మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాకర్ పాల్గొన్నారు.  

అయితే ఈ నిర‌స‌న కార్య‌క్రమాన్ని అడ్డుకోడానికి వైసీపీకి చెందిన స‌ర్పంచ్ టి.భూపతి, ఉప సర్పంచ్‌ ఎస్‌.రమేష్ రెడ్డి తో పాటు మ‌రి కొంద‌రు నాయ‌కులు ప్రయత్నించారు. ఈ సమయంలోనే చింతమనేని తన‌ను కులం పేరుతో తిట్టాడని స్థానిక స‌ర్పంచ్ టి. భూప‌తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలోనే మాజీ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.   

ఇక ఇప్పటికే చింతమనేనిపై రౌడీషీట్‌తో పాటు 60కి పైగా కేసులున్నాయి. టిడిపి అధికారంలో వున్న సమయంలోనూ వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న చింతమనేనిపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇక వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనపై వరుసగా కేసులు నమోదవుతూనే వున్నారు. ఇందులో పలు కేసుల్లో ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. 

ఇక పశ్చిమగోదావరి జిల్లాలో రెబల్ నేతగా పేర్గాంచిన చింతమనేని ప్రభాకర్ ఇసుక మాఫియా నేపథ్యంలో మహిళా తహాశీల్దార్ వనజాక్షిపై దాడికి పాల్పడటం గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై నిండు అసెంబ్లీలో రోజుల తరబడి చర్చ జరిగిందంటే ఈ కేసు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.   

ఇక దెందులూరు నియోజకవర్గం పరిధిలోని దెందులూరు, పెదవేగి, పెదపాడు పోలీస్ స్టేషన్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి. మెుత్తానికి ఇప్పటి వరకు చింతమనేని ప్రభాకర్ పై ఉన్న కేసులు సంఖ్య 60కి పైగా చేరుకుంది. 
 

click me!