YSRCP: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ (YS Jagan) ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తరుణంలో పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌ఛార్జిల మార్పుపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. పలువురు సిటింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతలతో జగన్ చర్చిస్తున్నారు.
YSRCP: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యూహారచన చేస్తున్నారు. ఎన్నికల బరిలో దించే అభ్యర్థుల జాబితాపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌ఛార్జీలను మార్చాలని నిర్ణయించారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులను మార్చేశారు. వారికే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తున్నామని స్పష్టం చేశారు. మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్‌ఛార్జిల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో మరికొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిచించారు.
మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, ఉష శ్రీచరణ్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీశ్ (ముమ్మిడివరం), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), బుర్రా మధుసూదన్ (కనిగిరి), ధనలక్ష్మి (రంపచోడవరం), ఎమ్మెల్సీ అనంతబాబు తదితరులు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ కీలక నేతలతో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి చర్చలు జరిపారు. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ .. ఐదో జాబితాపై తర్జన భర్జన పడుతోంది. త్వరలో ఐదో లిస్ట్‌ను వెల్లడించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఐదో జాబితా కాస్తా లేటుగా.. ఫిబ్రవరి రెండోవారంలో వెలువడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
రసవత్తరంగా ఉమ్మడి ప్రకాశం రాజకీయం
మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఆ జిల్లా బాధ్యతలు అప్పగించగా.. ప్రస్తుతం ఒంగోలు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి ఆ స్థానంపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఆయన్ను గిద్దలూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం . మరోవైపు.. తన కుమారుడు ప్రణీత్‌రెడ్డికి ఒంగోలు ఎంపీ సీటును ఇవ్వాలని బాలినేని కోరగా.. ఆ సీటు ప్రణీత్‌కు ఇచ్చేందుకు జగన్ ససేమీరా అన్నట్టు తెలుస్తోంది.