వైసీపీ నుండి టీడీపీలో చేరినందునే వివేకానందరెడ్డి హత్య కేసులో తన భర్త పేరును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి (శేఖర్ రెడ్డి) భార్య లక్ష్మీ ఆరోపిస్తున్నారు
పులివెందుల: వైసీపీ నుండి టీడీపీలో చేరినందునే వివేకానందరెడ్డి హత్య కేసులో తన భర్త పేరును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి (శేఖర్ రెడ్డి) భార్య లక్ష్మీ ఆరోపిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున తన భర్త ఇంట్లోనే ఉన్నాడని ఆమె చెప్పారు.
బుధవారం నాడు ఆమె ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. ఆరు మాసాల క్రితం రంగేశ్వర్ రెడ్డిని పులివెందులలో తన భర్త హత్య చేసిన విషయం వాస్తవమేనని ఆమె ఒప్పుకొన్నారు. తమ ఆస్తిని కాజేసినందుకే రంగేశ్వర్ రెడ్డిని తన భర్త చంపాడన్నారు.వివేకానందరెడ్డి కుటుంబంతో తమకు ఎలాంటి శతృత్వం లేదన్నారు.
గతంలో తాము వైసీపీలో ఉండేవాళ్లమని ఆమె చెప్పారు. కానీ, ఆ తర్వాత కొన్ని కారణాలతో టీడీపీలో చేరినట్టుగా ఆమె వివరించారు. టీడీపీలో చేరితే అన్ని రకాలుగా ఆదుకొంటామని ఆ పార్టీ నాయకత్వం తమకు భరోసా ఇచ్చిందన్నారు.
వివేకానందరెడ్డి హత్య విషయాన్ని తన భర్త కు ఆయన స్నేహితుడు ఫోన్ చేసి చెబితేనే తెలిసిందన్నారు. హత్య జరిగిన మరునాడు కూడ తన భర్త ఇంట్లోనే ఉన్నాడన్నారు. హత్య చేస్తే తన భర్త ఎందుకు ఇంటి వద్దే ఉంటాడని ఆమె ప్రశ్నించారు.
ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్ రెడ్డితో తమ కుటుంబానికి కూడ సంబంధాలు లేవన్నారు. పరమేశ్వర్ రెడ్డి తమకు రూ.5 లక్షలు డబ్బులు ఇవ్వాల్సి ఉందన్నారు.ఈ డబ్బుల కోసం తన భర్త పోలీసుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ కూడ నిర్వహించినట్టుగా ఆమె చెప్పారు.
ఈ డబ్బులు చెల్లించనందుకే పరమేశ్వర్ రెడ్డితో తన భర్త మాట్లాడడం లేదన్నారు. సింహాద్రిపురంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న తన భర్తకు పోలీసులు ఫోన్ చేసి పిలిపించినట్టు ఆమె చెప్పారు. మూడు రోజులుగా పోలీసుల అదుపులోనే ఆయన ఉన్నాడని ఆమె చెప్పారు. ఈ హత్యతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
సంబంధిత వార్తలు
శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు