పొత్తుతో కానిది పోరాటంతోనే, ఇందిరాకు పట్టిన గతే, మోడీపై బాబు తాజా ప్లాన్ ఇదే

First Published Jun 15, 2018, 2:40 PM IST
Highlights

బాబు తాజా వ్యూహమిదే


అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హమీల అమలుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టిడిపి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. బిజెపి పొత్తుతో సాధించలేనిది పోరాటంతో సాధించాలని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. ప్రతి నిమిషంలో  అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆయన పార్టీ ఎంపీలకు సూచించారు.నీతి ఆయోగ్ సమావేశంలో బిజెపియేతర పార్టీల సీఎంలు ప్లాన్ ప్రకారంగా వ్యవహరించే అవకాశం ఉంది.ఈ మేరకు ఆయా రాష్ట్రాల ఎంపీలతో బాబు చర్చలు జరుపుతున్నారు. 

తెలుగుదేశం పార్టీ  ఎంపీలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు  అమరావతిలో  సమావేశమయ్యారు.  ఈ సమావేశంలో  రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు దిశా నిర్ధేశం చేశారు.


కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఎంపీ సీఎం రమేష్‌ చేపట్టే దీక్షను విజయవంతం చేయాలని బాబు సూచించారు. ఎంపీలంతా కడప వెళ్లి సంఘీభావం తెలపాలని సూచించారు. కడప తర్వాత విశాఖ రైల్వే జోన్‌ అంశాన్ని ఉద్ధృతం చేయాల్సిందిగా కోరారు. బిజెపి, వైసీపీ కుట్ర రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని బాబు పార్టీ ఎంపీలను కోరారు.

న్యూఢిల్లీలో బిజెపి పెద్దలతో పీఎసీ ఛైర్మెన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశం కావడాన్ని ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు. బిజెపి, వైసీపీ కుట్ర రాజకీయాలు పరాకాష్టకు చేరుకొన్నాయని  ఆయన చెప్పారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆకుల సత్యనారాయణలు కలిసి తిరిగిన వీడియోలు, ఫోటోలు కూడ మీడియాలో వచ్చిన విషయాన్ని ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు.


పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు మరింత వేగంగా జరగాలంటే నిధులు అవసరమన్నారు. అయితే నిదుల విడుదలలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు  నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడిని తీసుకురావాలని ఆయన సూచించారు. ఎన్టీఆర్ తో పెట్టుకొని  ఇంధిరాగాంధీ చేతులు కాల్చుకొన్నారని ఆయన గుర్తు చేశారు. కుట్ర రాజకీయాలను ఎదుర్కోవడం  టిడిపికి కొత్తేమీ కాదన్నారు.  ఆనాడు ఇందిరా చేసిన కుట్రలను ఎదుర్కొన్నట్టుగానే ఈనాడు బిజెపి కుట్రలను కూడ తిప్పికొడతామని బాబు ధీమాను వ్యక్తం చేశారు. 

నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పలువురు సీఎంలతో చర్చించారు. బిజెపియేతర రాష్ట్రాల సీఎంలతో ఆయన చర్చించారు. సమావేశానికి వెళ్ళి ఎవరి వాదనలు వారు విన్పించి సమావేశాన్ని బాయ్‌కాట్ చేసే అంశంపై కూడ చర్చించారు.

అయితే ఈ విషయమై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.   ఇతర పార్టీల నేతలతో కూడ చర్చలు జరుపుతున్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ దఫా నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై బిజెపియేతర పార్టీల సీఎంలు ప్లాన్ ప్రకారంగా వ్యవహరించనున్నారు. దీక్షలో ఉన్న కేజ్రీవాల్ తో ఫోన్ లో మాట్లాడినట్టు బాబు ఎంపీల సమావేశంలో ప్రస్తావించారు. అంతేకాదు ఢిల్లీ పర్యటనలో కేజ్రీవాల్ ను కలిసి తన సంఘీభావాన్ని ప్రకటించనున్నట్టు ఆయన చెప్పారు.


 

click me!