సొంతపక్షమే అఖిలపక్షమా ?

First Published Apr 8, 2018, 8:35 PM IST
Highlights
చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశమే అందుకు పెద్ద నిదర్శనం.

చివరకు చంద్రబాబునాయుడు పరిస్ధితి ఈ స్ధాయికి దిగజారిపోయింది. ఒకపుడు కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు పిలిస్తే పలికే ప్రతిపక్షం రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు. చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశమే అందుకు పెద్ద నిదర్శనం.

సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం వైసిపి తో పాటు బిజెపి, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు, లోక్ సత్తా ల నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరుకాలేదు.

మరి, అఖిలపక్ష సమావేశానికి హాజరైందెవరయ్యా అంటే, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, ప్రత్యేకహోదా సాధన సమితి తరపున నటుడు శివాజి తదితరులు.  వీరిద్దరూ చంద్రబాబు మనుషులే అనే ముద్ర ఎప్పటి నుండో ఉంది.

వీరుకాకుండా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు, సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ తదితరులు హాజరయ్యారు. హాజరైన వారిలో ప్రముఖుడెవరైనా ఉన్నారంటే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఒక్కరే. అదికూడా ఉత్తరాంధ్ర సమస్యలు మాట్లాడటానికే హాజరయ్యారు.

సరే, ముఖ్యమంత్రి దగ్గర నుండి ఆహ్వానం అందిదని హాజరయ్యే వారు మరికొందరున్నారు. అసలు, ఉద్యోగ సంఘాల నేతలకు అఖిలపక్ష సమావేశానికి సంబంధం ఏంటో చంద్రబాబే చెప్పాలి.

అంటే ప్రతిపక్షాలెటూ రావటం లేదు కాబట్టి సమావేశానికి నిండుదనం రావటం కోసం ఎవరిని పడితే వారిని అనుమతించినట్లుంది వ్యవహారం. మొదటిసారి అఖిలపక్ష సమావేశానికి కూడా వైసిపి, జనసేన, బిజెపి, లోక్ సత్తాలు హాజరుకాని విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

మొత్తానికి చంద్రబాబు పరిస్దితి ‘తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది’ అన్నట్లైపోయింది.

 

click me!