ఢిల్లీకి బాబు: మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపుపై పార్టీ నేతలతో చర్చ

By narsimha lodeFirst Published Feb 7, 2024, 1:43 PM IST
Highlights


పార్టీ సీనియర్లతో  చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ నేతలతో చర్చల సందర్భంగా ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై చర్చిస్తున్నారు.

అమరావతి:తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  బుధవారం నాడు మధ్యాహ్నం  న్యూఢిల్లీ వెళ్లనున్నారు.  రానున్న ఎన్నికల్లో  పొత్తులపై భారతీయ జనతా పార్టీ పెద్దలతో  చంద్రబాబు భేటీ కానున్నారు. 

న్యూఢిల్లీ వెళ్లే ముందు  తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతలతో చంద్రబాబు మంతనాలు జరిపారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటికే  తెలుగు దేశం, జనసేనలు కలిసి పోటీ చేయనున్నట్టుగా ప్రకటించాయి.  ఈ రెండు పార్టీల  మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరగనున్నాయి.ఈ నెల  8వ తేదీన మరోసారి  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు సమావేశం కానున్నారు. రెండు పార్టీల మధ్య  సీట్ల పంపకంపై చర్చించారు. 

ఈ కూటమిలో బీజేపీలో చేరుతుందా లేదా అనే విషయమై గత కొంతకాలంగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతుంది.బీజేపీ అగ్రనేతలతో పొత్తులపై చర్చించేందుకు  ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు బయలుదేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో  చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ లభిస్తే  మోడీతో కూడ చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

జనసేనతో పాటు, బీజేపీ కూడ  తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తే  ఈ  రెండు పార్టీలకు కలిపి ఎన్ని సీట్లను వదులుకోవాలనే విషయమై  చంద్రబాబు  పార్టీ నేతలతో చర్చించినట్టుగా సమాచారం.  రాష్ట్రంలోని  కీలక స్థానాలను వదులుకోవద్దని పార్టీ నేతలు చంద్రబాబును కోరినట్టుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అసెంబ్లీ స్థానాల కంటే పార్లమెంట్ స్థానాలపై  బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టే అవకాశం లేకపోలేదు. అయితే జనసేన ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కోరే అవకాశం ఉందని  తెలుగు దేశం వర్గాల్లో ప్రచారంలో ఉంది. విజయం సాధించే స్థానాలను మిత్రపక్షాలను ఇవ్వాలని  తెలుగుదేశం అధినేతకు ఆ పార్టీ నేతలు సూచించారు. మిత్రపక్షాలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తే  2009లో చోటు చేసుకున్న ఘటనలు జరిగే ప్రమాదం కూడ లేకపోలేదని  టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

also read:ప్రముఖుల వ్యాఖ్యలు, కొటేషన్లు, విపక్షంపై విసుర్లు: బుగ్గన బడ్జెట్ ప్రసంగం

బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ, ఏడు పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని తెలుగు దేశం పార్టీ నేతలు  చంద్రబాబు దృష్టికి తెచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే  ఈ ప్రతిపాదనకు ఈ రెండు పార్టీల నుండి ఎలాంటి స్పందన వస్తుందనేది రానున్న రోజుల్లో తేలనుంది. 

2014లో జరిగిన ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో  బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు ఉంది.  ఈ కూటమి అప్పట్లో  జనసేన మద్దతు ప్రకటించింది. 2014 ఎన్నికల ముందే  జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది.  2019 ఎన్నికల్లో  జనసేన పార్టీ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పోటీ చేసింది.  రెండు స్థానాల్లో  పవన్ కళ్యాణ్ పోటీ చేసినా ఓటమి పాలయ్యాడు. 2019 ఎన్నికల్లో  సీపీఐ, సీపీఐ(ఎం), బీఎస్పీలతో కలిసి  జనసేన పోటీ  చేసింది.   2019 ఎన్నికల ఫలితాల తర్వాత  పవన్ కళ్యాణ్  బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు.

also read:ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024: రూ.2,86,389 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన బుగ్గన

అయితే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనేది తన లక్ష్యమని  పవన్ కళ్యాణ్  ప్రకటించారు. ఈ దిశగానే వ్యూహాలు రచిస్తానని ప్రకటించారు.  2023 సెప్టెంబర్ లో  చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో  టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
 

click me!