వైఎస్ జగన్ కు 30 ఏళ్ల వరకు జైలు శిక్ష: చంద్రబాబు

By telugu teamFirst Published Oct 17, 2020, 7:29 AM IST
Highlights

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ కు 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చునని చంద్రబాబు అన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) చెప్పిందని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు తెలిపారు. అవినీతిపరుడైన జగన్ ముఖ్యమంత్రి అయి న్యాయవ్యవస్థపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. 

గుంటూరు లోకసభ నియోజకవర్గం నేతలతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్మాదులు స్వైర విహారం చేస్తున్నారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలు లోపిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి విజయవాడలో యువతిపై జరిగిన దాడి నిదర్శనమని ఆయన అన్నారు. 

దిశ చట్టం తెచ్చామని వైసీపీ నాయకులు గొప్పలు చెబుతున్నారని, ఇప్పుడు ఆ చట్టానికి మార్పులు చేయాలని కేంద్రం వెనక్కి పంపిందని, నిర్భయ చట్టంతోనే మహిళలపై జరిగే అన్యాయాలను అరికట్టవచ్చుననిఅప్పుడే తాము చెప్పిన వైసీపీ వినిపించుకోలేదని ఆయన గుర్తు చేశారు 

రాజధానిని మార్చబోమని ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చి ఇప్పుడు మూడు ముక్కలాట ఆడుతున్నారని ఆయన అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడ్కో నిర్మించిన 1800 ఇళ్లను పేదలకు ఇవ్వలేదని, ఎనిమిది వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వంలో ఐదు వేల ఇళ్లు నిర్మించామని, వాటిని ఇవ్వలేదని ఆయన చెప్పారు.

అమరావతి ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు కట్టుబానిసల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారని, డబ్బుల కోసం రాజధాని ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నెల 22వ తేదీ నాటికి అమరావతికి ప్రధాని శంకుస్థాపన చేసిన అయిదేళ్లవుతోందని, టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే అమరావతి ప్రాంతం అభివృద్ధి చెంది ఉండేదని ఆయన అన్నారు.

వరదలతో నష్టపోయిన రైతులను అధికార పార్టీ నేతలు పలకరించడం లేదని, టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు లోకసభ నియోజకవర్గం పరిధిలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని ఆయన చెప్పారు. 

click me!