ఎట్టకేలకు పోతిరెడ్డిపాడుపై పెదవి విప్పిన చంద్రబాబు

By telugu teamFirst Published May 27, 2020, 1:25 PM IST
Highlights

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబు పెదవి విప్పారు. పోతిరెడ్డిపాడును ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారని చంద్రబాబు చెప్పారు. జగన్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

అమరావతి: ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు పోతిరెడ్డిపాడుపై పెదవి విప్పారు. జూమ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు. పోతిరెడ్డిపాడుపై వైఖరి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెసు నేతలు, మంత్రులు గత కొలంగా చంద్రబాబును డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానాడులో ఆయన పోతిరెడ్డి పాడును ప్రస్తావించారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలోనే పోతిరెడ్డిపాడు నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు పనులను 75 శాతం పూర్తి చేశామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని, తాము చేపట్టిన నీటి పారుదుల ప్రాజెక్టులను అన్నింటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన అన్నారు. రాయలసీమకు నీళ్లు రావాలంటే గోదావరి జలాలే ముఖ్యమని ఆయన అన్నారు. అమరావతిని ఆదర్శంగా తీర్చి దిద్దాలని అనుకున్నట్లు ఆయన తెలిపారు. 

Also Read: అందుకే విశాఖ సందర్శించలేకపోయా: మహానాడులో చంద్రబాబు

హైదరాబాదు జంటనగరాలకు తోడుగా సైబరాబాద్ ను నిర్మించానని ఆయన చెప్పారు. తెలంగాణలో అభివృద్ధికి అనుకూల వాతావరణం ఏర్పాటు చేశానని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పారు. ఆనాడు పెట్టుబడుల కోసం ఎన్నో దేశాలు తిరిగానని చంద్రబాబు చెప్పారు. 

రాజకీయ రిజర్వేషన్ల కోసం పోరాడింది తమ పార్టీ మాత్రమేనని ఆయన చెప్పారు. గత ఏడాదిలో పడిన ఇబ్బందులు గతంలో ఎన్నడూ పడలేదని, రాజకీయంగా ఏడాది పాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నామని ఆయన చెప్పారు. తమ పార్టీ నేతలను బ్లాక్ మెయిల్ చేసి సరెండర్ చేయించుకుంటున్నారని, టీడీపీ కార్యకర్తలపై వందలాది కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. 

తాము ప్రవేశపెట్టిన 34 ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన చెప్పారు. వృద్ధ్యాప్య పింఛన్లు పెంచుతామని చెప్పి రద్దు చేశారని ఆయన అన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమని చెప్పారు. గత 38 ఏళ్లుగా ఎన్నో త్యాగాలు చేస్తూ ధైర్యంగా నిలబడ్డారని ప్రశంసించారు. ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగిన పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని ఆయన విమర్శించారు. తెలుగువారి కోసం 24 గంటలు తమ పార్టీ కష్టపడిందని ఆయన చెప్పారు.

వైసీపీ నేతలు ఉన్మాదులుగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చిరువ్యాపారులను కూడా చూడకుండా దెబ్బ తీశారని ఆయన అన్నారు. కరోనా సమయంలో కార్యకర్తల సేవలు మరువలేనివని ఆయన అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ టీడీపి అని ఆయనఅన్నారు.  

click me!