Chandrababu: చంద్రబాబు మాస్టర్‌ ప్లాన్‌: 2029లో గెలుపు కోసం ఇప్పటి నుంచే అడుగులు

By Galam Venkata Rao  |  First Published Jul 21, 2024, 11:07 AM IST

‘నేను అందుకే 1995 పాలన అని మళ్లీ చెబుతున్నాను. రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఉండాలి. దాన్ని 1995లో అమలు చేశాం. మళ్లీ ఆ విధానం అమల్లో ఉండాలి.’


ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయం సాధించింది. 164 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్‌సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి కాగా, పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం అయిపోయారు. మరోవైపు 16 మంది టీడీపీ ఎంపీలతో మద్దతుతో కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన చంద్రబాబు.. జాతీయ స్థాయిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఎన్‌డీయే కూటమిలో కీలకమైనందున ఇద్దరు టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర కేబినెట్‌లో పదవులు దక్కాయి.

విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి...

Latest Videos

undefined

కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్‌ నాయుడు ఇప్పటికే రాష్ట్రంలోని విమానాశ్రయాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేకించి భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని ఆరు నెలల ముందుగానే ప్రారంభించేలా నిర్మాణ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో చిన్న విమానాశ్రయాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవల తెలిపారు.

ప్రాజెక్టులు, నిధులు...

అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వమే ఉండటంతో విభజన సమస్యలతో పాటు కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల సాధన సులభతరం అవుతుందని అంతా భావిస్తున్నారు. ఈ బాధ్యతను ఎంపీలు, రాష్ట్ర మంత్రులకు అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయా శాఖలకు చెందిన రాష్ట్ర మంత్రులు.. కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నిధులు, ప్రాజెక్టులు రాబట్టాలని ఇటీవల జరిగిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతితో పాటు పోలవరం, జల్ జీవన్ మిషన్ తదితర ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులు రాబట్టాలని సూయించారు. 

ఓ మంత్రికి క్లాస్...

అలా, రాష్ట్ర అభివృద్ధికి అవసరమయ్యే నిధులు, ప్రాజెక్టులను సాధించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్పష్టంగా చెబుతున్నారు. ప్రజలు, ప్రభుత్వ అధికారులతో కలిసిపోవాలని.. ప్రజాప్రతినిధులమన్న గర్వం లేకుండా పనిచేయాలని సూచిస్తున్నారు. ఇటీవలే ఓ మంత్రి భార్య పోలీసు అధికారిని దబాయించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు సదరు మంత్రికి కాల్‌ చేసి క్లాస్‌ పీకారు. ప్రజా జీవితంలో హుందా ప్రవర్తించాలని హెచ్చరించారు. దీంతో ఆ మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.   

ప్లాన్ ఇదే...

ఇక, 2029లో కూడా పార్టీ గెలవడానికి నేటి నుంచే అడుగులు వేయాలని తాజాగా మంత్రులు, ఎంపీల సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు అవసరం అయిన మంచి పనులు చేసుకుంటూ పోవాలని.... ప్రజలకు మంచి చేసే విషయంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదని స్పష్టం చేశారు. పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలని చెప్పారు.

ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలని.. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లాలకు వెళ్లినప్పుడు కూడా మంత్రులు తప్పకుండా పార్టీ కార్యాలయానికి వెళ్లాలన్నారు. ఎన్డీయే నేతలతో సమావేశమవ్వాలి... కార్యకర్తలకు అండగా నిలవాలి. వారికి తగు సాయం చేయాలని సూచించారు.

‘నేను అందుకే 1995 పాలన అని మళ్లీ చెబుతున్నాను. రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఉండాలి. దాన్ని 1995లో అమలు చేశాం. మళ్లీ ఆ విధానం అమల్లో ఉండాలి. పబ్లిక్ పాలసీలతో దేశ గమనం మార్చవచ్చు. ప్రజల తలరాతలు మార్చవచ్చు అని నాడు చేసి చూపించాం. అమెరికాలో అమెరికన్స్ 65,900 డాలర్ల తలసరి ఆదాయం పొందుతుంటే.... భారతీయులు 1.19 లక్షల డాలర్ల తలసరి ఆదాయం పొందుతున్నారు. పాలసీలు ఇచ్చే ఫలితాలకు ఇదొక ఉదాహరణ’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు చెప్పారు. 

click me!