Peddavagu: తెలంగాణలో దెబ్బతిన్న ప్రాజెక్టు.. ఏపీలో బీభత్సం

By Galam Venkata Rao  |  First Published Jul 21, 2024, 9:35 AM IST

తెలంగాణలోని పెదవాగుకు ఆకస్మిక వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో 12 గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే, వేల ఎకరాల్లో పంటలు, రోడ్లు, తాగునీటి వనరులకు నష్టం జరిగినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

 


తెలంగాణలోని పెదవాగుకు ఆకస్మిక వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో 12 గ్రామాల తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆయన.. వరద సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. పెదవాగు ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల పరిధిలో ఉందని.. అయితే ప్రాజెక్ట్ నిర్వహణ తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు. 

ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కంటే మూడింతలు ఎక్కువ వర్షపాతం నమోదైందని మంత్రి పార్థసారథి తెలిపారు. గత మూడురోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులో అధికంగా వరద నీరు చేరడంతో పెదవాగు ప్రాజెక్ట్ 200 మీటర్ల మేర దెబ్బతింది. ఆ వరద కారణంగా వేలేరుపాడు, కుక్కునూరు మండలంలోని 7 గ్రామ పంచాయతీల పరిధిలోని 12 గ్రామాలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం వరదల కారణంగా 7 వేల 450 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. 290 ఎకరాల్లో వరి నారుమళ్లు దెబ్బతిన్నాయి. 106 ఎకరాల్లో ఉద్యానవనాలు పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి 5 కిలోమీటర్ల మేర 126 ప్రదేశాల్లో రోడ్లు ధ్వంసమవగా... 4 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. తాగునీటి వనరులకు సంబంధించి 32 మోటార్లు దెబ్బతినగా.. 23 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. 

Latest Videos

కాగా, వరద నీరు తగ్గిన వెంటనే నష్టాలపై అధికారులు అంచనా వేస్తారని మంత్రి పార్థసారథి తెలిపారు. వరదల్లో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని, వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ కార్యక్రమాలు అందించాల్సిందిగా అధికారులను, సిబ్బందిని ఆదేశించారని వివరించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును మంత్రి పార్థసారథి అభినందించారు.

click me!