ఆయనో ట్రబుల్ షూటర్... ఆ విషయాల్లో: ప్రణబ్ మృతిపై చంద్రబాబు

By Arun Kumar PFirst Published Aug 31, 2020, 8:22 PM IST
Highlights

ప్రణబ్ ముఖర్జీ మృతి భారతదేశానికే తీరనిలోటని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. 

గుంటూరు: బహుముఖ ప్రజ్ఞాశాలి, కాకలు తీరిన రాజనీతిజ్ఞులు ప్రణబ్ ముఖర్జీ మృతిచెందడం అత్యంత బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 

''ప్రణబ్ ముఖర్జీ మృతి భారతదేశానికే తీరనిలోటు. కాకలు తీరిన రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయింది. 6 దశాబ్దాల రాజకీయ చరిత్రలో వివాద రహితుడిగా పేరొందారు. వివాదాల పరిష్కర్త(ట్రబుల్ షూటర్)గా పేరొందారు'' అని కొనియాడారు. 

''సుదీర్ఘకాలం కేంద్రమంత్రిగా ప్రణబ్ దాదా చేసిన సేవలు మరువలేం. కేంద్ర ఆర్ధికమంత్రిగా, రక్షణ మంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయం. ఆయన నిరాడంబరత, నిబద్దత, నిజాయితీ అందరికీ మార్గదర్శకం. భావి తరాలకు మార్గదర్శకుడు, ఆదర్శప్రాయుడు. గొప్ప పార్లమెంటేరియన్ గా పేరొందారు'' అని పేర్కొన్నారు. 

read more  ప్రణబ్ మృతి... జగన్, చంద్రబాబు దిగ్భ్రాంతి

''భారత ఆర్ధిక విధానాలు, రక్షణ విధానాల రూపకల్పనలో దేశీయ, విదేశీ వ్యవహారాలు రూపకల్పనలో ప్రణబ్ ముఖర్జీ సేవలు నిరుపమానం. ప్రణబ్ మృతి దేశానికే తీరనిలోటు. ఆయన సేవలు సదా స్మరణీయం. ప్రణబ్ ముఖర్జీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నా'' అని చంద్రబాబు తెలిపారు.

ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు. 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ చేసిన సేవలను గవర్నర్ గుర్తుచేసుకున్నారు.  దివంగత ప్రణబ్ ఐదు దశాబ్దాలు పాటు ప్రభుత్వంతో పాటు పార్లమెంటు ద్వారానూ దేశానికి ఆదర్శప్రాయమైన సేవలను అందించారన్నారు. 
ఈ నేపధ్యంలో సోమవారం గవర్నర్ సంతాప సందేశం విడుదల చేశారు. 

స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ విదేశీ, రక్షణ, వాణిజ్యం, ఆర్థిక మంత్రిగా వేర్వేరు సమయాల్లో పనిచేసి అరుదైన ఘనతను కలిగి ఉన్నారని...సమాచార హక్కు, ఉపాధి హక్కు, ఆహార భద్రత, యుఐడిఎఐ ఏర్పాటు వంటి ముఖ్యమైన చట్టాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారన్నారు. ప్రణబ్ ముఖర్జీ ఒక శక్తివంతమైన వక్త, పండితుడు, మేధావి, అపారమైన రాజకీయ చతురత కలిగిన  నాయకుడని,  కష్టతరమైన జాతీయ సమస్యలపై బహుళ-పార్టీ ప్రజాస్వామ్యంలో భాగమైన రాజకీయ పక్షాల మధ్య ఐక్యతను సాధించి ఏకాభిప్రాయ సాధకునిగా తన భూమికకు ప్రశంసలు అందుకున్నారని బిశ్వ భూషణ్ హరిచందన్ గుర్తుచేసారు. ముఖర్జీ కుటుంబ సభ్యులకు గవర్నర్ సంతాపం తెలిపారు.

click me!