TDP Mahanadu 2025 : ఇదీ పసుపు జెండా పవర్ : ఎన్టీఆర్ జయంతి వేళ చంద్రబాబు నోట కవితాత్మక ప్రసంగం

Published : May 28, 2025, 05:18 PM ISTUpdated : May 28, 2025, 05:25 PM IST
Nara Chandrababu Naidu

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్పీచ్ అంటే చాలా సీరియస్ గా సాగుతుంది. కానీ ఆయన ఎన్టిఆర్ జయంతి సందర్భంగా కడప మహానాడు వేదికగా కవితాత్మకంగా మాట్లాడారు.

TDP Mahanadu 2025 : తెలుగుదేశం పార్టీ రాయలసీమలోని కడప జిల్లాలో మూడు రోజులు మహానాడు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిన్న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇవాళ(బుధవారం) రెండోరోజు కొనసాగింది. మే 28 అంటే ఇవాళ టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్డిఆర్) జయంతి... ఈ నేపథ్యంలో మహానాడు మొత్తం ఆయన నామస్మరణతోనే కొనసాగింది. ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తెలుగు జాతి గౌరవాన్ని పెంచిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన స్థాపించిన పార్టీ దశాబ్దాలుగా తెలుగు ప్రజలకు సేవ చేసుకుంటోందని అన్నారు. తెలుగు రాజకీయాల దిశను మార్చింది పసుపు జెండా అని కొనియాడారు. సామాన్యుల కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టారని అన్నారు. ఇక పార్టీ గుర్తులో ఇల్లు, నాగలి, చక్రం పెట్టి తన ప్రాధాన్యాలు వివరించారన్నారు. 43 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ రూపొందించిన జెండా ప్రజాసేవలో దిగ్విజయంగా రెపరెపలాడుతోందని చంద్రబాబు అన్నారు.

''పసుపు జెండా అంటే....తెలుగు వారి ఆత్మ గౌరవం చాటిన జెండా

పసుపు జెండా అంటే....తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన జెండా

పసుపు జెండా అంటే...దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికిన జెండా

పసుపు జెండా అంటే....తెలుగు వారిని అభివృద్ధి పథాన నడిపించిన జెండా

పసుపు జెండా అంటే....ఆడబిడ్డలకు అండగా నిలిచిన జెండా

పసుపు జెండా అంటే....రైతన్నల కన్నీరు తుడిచి వెన్నంటే ఉన్న జెండా

పసుపు జెండా అంటే...విజన్ తో తెలుగుజాతికి విజయాన్నిచ్చిన జెండా

పసుపు జెండా అంటే....తెలుగు ప్రజల నమ్మకం, విశ్వాసం, భవిష్యత్, భరోసా'' అంటూ కవితాత్మకంగా టిడిపి పార్టీ, పసుపు జెండా గొప్పతనాన్ని వివరించారు చంద్రబాబు.

ఇక ఎన్టిఆర్ ప్రజా సంక్షేమం, అభివృద్దికి సమ ప్రాధాన్యత ఇస్తూ సుపరిపాలన అందించారని... రాజకీయాల్లో కొత్త ఒరవడిని ప్రారంభించారని అన్నారు. పేదవాడి ఆకలి తీర్చేందుకే రెండు రూపాయలకు కిలో బియ్యం అందించారన్నారు. పేద మద్యతరగతి ప్రజలు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలని పక్కా ఇళ్లు, బలహీనవర్గాలకు జనతా వస్త్రాలు అందించారని గుర్తుచేసారు. వృద్ధాప్య పెన్షన్లు, రూ.50కే హార్స్‌ పవర్‌ విద్యుత్‌, గురుకుల పాఠశాలల ఏర్పాటు, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ఆస్తి హక్కు... ఇలా ఎన్నో గొప్న పథకాలు ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైనవే అని చంద్రబాబు అన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం... ఇలా సంక్షేమం- అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగించారని అన్నారు. పటేల్‌ పట్వారి వ్యవస్థ రద్దు, సింగిల్ విండో విధానం, బీసీలకు, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది ఎన్‌టిఆరే అని చంద్రబాబు అన్నారు.

ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా, పాలకుడిగానే కాదు సినీరంగంలో హీరోగా, దర్శకుడిగా, రచయితగా కూడా రాణించారని.. ఇలా అన్నిరంగాలపై పట్టున్న నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు జాతి మొత్తం అభిమానించే, ఆరాధించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్... మరి ఆయన జయంతి అంటే తెలుగు జాతికే పండగరోజని చంద్రబాబు అన్నారు. మనం కనులారా చూసిన యుగపురుషుడు ఎన్టీఆర్... ఆయనలాంటి మహా నాయకుడు మళ్లీ పుట్టడని చంద్రబాబు అన్నారు.

 

 

ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఎన్టీఅర్ అంచెలంచెలుగా ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగారని చంద్రబాబు కొనియాడారు. తెలుగు సినీ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనూ ఆయనకంటూ ప్రత్యేక పేజీలుంటాయన్నారు. అయితే ఎన్టీఆర్‌ జీవితమేమీ పూల పాన్పు కాదు.. నిరంతరం పోరాటమేనని అన్నారు. స్వీయ క్రమశిక్షణ, నీతి నిజాయితీ, పట్టుదలే ఆయనను ఈస్థాయికి తీసుకువచ్చాయని చంద్రబాబు అన్నారు.

పాలు అమ్ముతూ చదువుకున్నా, ప్రభుత్వ ఉద్యోగం చేసినా, సినిమాల్లో నటించినా, రాజకీయాల్లోకి వచ్చినా ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని వీడలేదన్నారు. ఒక సామాన్య రైతుబిడ్డగా పుట్టి... 33 ఏళ్లు వెండితెర జీవితంలోనూ, 14 ఏళ్లు రాజకీయ జీవితంలోనూ అద్వితీయ చరిత్ర సృష్టించారన్నారు. అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు... నరాల్లో ఉత్తేజం వస్తుంది... కొండనైనా ఢీ కొట్టగలం అనేంతగా ఆత్మవిశ్వాసం వస్తుంది... పట్టుదల వస్తుంది. అదీ ఆయన పేరులో ఉన్న పవర్ అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

లోకేష్ పంచ్ లకి పడి పడి నవ్విన టీచర్స్ Nara Lokesh Meets Teachers Returned from Singapore Study Tour
ఇలా చేస్తే ఒక్క క్లిక్ తో ఏ సబ్జెక్టువీక్ ఉన్నాడో ఈజీగా తెలిసిపోతుంది | Nara Lokesh Meets Teachers